
పండ్లు, కూరగాయల విస్తీర్ణం డబుల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
ఉద్యాన పంటల విస్తరణకు తెలంగాణ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక – 2035
రైతులకు అధిక లాభాలు – పంటల విలువలో పెరుగుదల లక్ష్యం
హార్టికల్చర్ ప్లాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 9 :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటిన తరువాత వ్యవసాయ రంగంలో విస్తృతమైన పురోగతి సాధించినప్పటికీ ఉద్యాన పంటల విస్తీర్ణం మరియు ఉత్పాదకతలో ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక – 2035”ను సిద్ధం చేసింది.
ఈ ప్రణాళికను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించింది. ఇందులో ఉద్యాన పంటల ప్రస్తుత స్థితి, భవిష్యత్ అవసరాలు, ఉత్పత్తి లోటు, మౌలిక వసతుల కొరత, మార్కెటింగ్ లోపాలు, మరియు పంటల విలువ పెంపు దిశలో కార్యాచరణ వ్యూహాలను సమగ్రంగా పొందుపరిచారు.
ఉద్యాన పంటల ప్రస్తుత స్థితి
2023–24లో తెలంగాణలో ఉద్యాన పంటలు 11.91 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగి 42.58 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాయి. మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, దానిమ్మ, టమాటో, వంగ, ఆయిల్ పామ్, మిరప, పసుపు రాష్ట్రంలోని ప్రధాన పంటలుగా గుర్తించబడ్డాయి.
రాష్ట్ర మొత్తం సాగులో ఉద్యాన పంటలు 6 శాతం విస్తీర్ణం కలిగి ఉండగా, వ్యవసాయ స్థూల విలువలో వాటి భాగస్వామ్యం 30 శాతంగా ఉంది.
వృద్ధి సవాళ్లు
కూరగాయల విస్తీర్ణం గత దశాబ్దంలో నిలకడగా లేకపోవడం, పండ్ల ఉత్పాదకత తక్కువగా ఉండడం, పంట కోత అనంతర నష్టాలు ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్యలుగా గుర్తించారు. నాణ్యమైన విత్తనాల కొరత, కూలీల సమస్య, మార్కెటింగ్ లోపాలు, శీతల గిడ్డంగుల లేమి రైతులకు సవాళ్లుగా మారాయి.
భవిష్యత్ అవసరాల అంచనా
ఉద్యాన విశ్వవిద్యాలయం అంచనాల ప్రకారం, రాష్ట్రంలో 2035 నాటికి పండ్ల అవసరం 23.74 లక్షల టన్నులు, కూరగాయల అవసరం 83.47 లక్షల టన్నులుగా ఉండనున్నాయి. ప్రస్తుత ఉత్పత్తి స్థాయిని బట్టి పండ్లలో 5 లక్షల టన్నుల వరకు, కూరగాయలలో 72 లక్షల టన్నుల వరకు లోటు తలెత్తే అవకాశం ఉంది.
2035 లక్ష్యాలు
- పండ్ల తోటల విస్తీర్ణం 1.32 లక్షల ఎకరాలు,
- కూరగాయల విస్తీర్ణం 2.45 లక్షల ఎకరాలు పెంచే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించబడింది.
- అధిక దిగుబడి రకాలు, యాంత్రీకరణ, రక్షిత సాగు పద్ధతులు, శీతల గిడ్డంగులు, ఎగుమతులు మరియు విలువ జోడింపులపై ప్రధాన దృష్టి సారించారు.
పెట్టుబడి – లాభదాయకత
రాబోయే ఐదేళ్లలో 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, 942.50 కోట్లు డ్రిప్ వ్యవస్థలపై పెట్టి, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు, కేంద్ర పథకాలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ నిధులు వినియోగించి ఎగుమతులు, విలువ జోడింపుతో ఉత్పత్తులను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది.
అమలు విధానం
ఈ ప్రణాళికను ఉద్యాన శాఖ, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, నాబార్డ్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు స్టార్టప్స్ సమన్వయంతో అమలు చేయనున్నారు.
ఉత్పత్తి మెరుగుదల దిశగా
ఉత్పాదకత పెంపు కోసం అధిక దిగుబడి రకాల రూపకల్పన, విపరీత వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విత్తనాలు, వాతావరణ ఆధారిత సూచనలు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు, శీతల నిల్వ సదుపాయాలు ఏర్పాటు, హైదరాబాదులో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాక్ హౌస్ స్థాపన వంటి చర్యలు చేపట్టాలని ప్రణాళికలో పేర్కొన్నారు.
ఈ ప్రణాళిక అమలుతో 2035 నాటికి తెలంగాణ ఉద్యాన పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన మద్దతు ఇవ్వనుంది.
*
