
వరుసగా 8 సిక్సులతో చరిత్ర సృష్టించిన ఆకాశ్ చౌదరి 💥
11 బంతుల్లో హాఫ్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆకాశ్
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ శతకానికి మేఘాలయ బ్యాటర్ ఘనత
సూరత్, నవంబర్ 9:
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధిస్తూ మేఘాలయ ఆటగాడు ఆకాశ్ కుమార్ చౌదరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. వరుసగా 8 సిక్సులు బాదిన ఈ ఇన్నింగ్స్ అభిమానులను విస్మయానికి గురి చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ భారీ స్కోరు దిశగా సాగుతుండగా, జట్టు 576/6 వద్ద 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆకాశ్ ప్రారంభం నుంచే ఆగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లాడు. అరుణాచల్ బౌలర్ లిమార్ దాబీ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 6 సిక్సులు బాదాడు. అనంతరం మరో ఓవర్‌లో తొలి రెండు బంతుల్లోనూ సిక్సులు కొట్టి మొత్తం 8 సిక్సర్లతో 11 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. చివరికి 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో మేఘాలయ 628/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
బ్యాటింగ్‌లో మెరిసిన ఆకాశ్ బౌలింగ్‌లోనూ రాణించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అరుణాచల్ తొలి వికెట్ పడగొట్టాడు.
ఈ రికార్డుతో ఆకాశ్ పలు చారిత్రాత్మక రికార్డులను చెరిపేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇంతవరకు వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు 2012లో లెస్టర్‌షైర్ ఆటగాడు వేన్ వైట్ (12 బంతులు) పేరిట ఉండేది. భారత్ తరఫున ఈ రికార్డు 2015లో బందీప్ సింగ్ (15 బంతులు) పేరిట నమోదు అయ్యింది. ఇప్పుడు ఆ రెండు రికార్డులను అధిగమిస్తూ ఆకాశ్ చౌదరి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
