
విద్యుత్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందుల్లో
హైదరాబాద్, నవంబర్ 9 (VGLOBE NEWS): రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో విద్యుత్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి తెలిపారు. ఆధునిక పద్ధతులు అలవీ కాని స్థితి, స్టోర్లలో మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, ఎల్సీలు ఇవ్వకపోవడంతో పనులు పెండింగ్‌లో పడటం వంటి సమస్యలతో కాంట్రాక్టర్లు అయోమయంలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కిన్నెర గ్రాండ్ (హబ్సిగూడ)లో జరిగిన రాష్ట్ర జనరల్ బాడీ ప్రత్యేక సమావేశంలో జీసీ రెడ్డి అధ్యక్షతన ఈ చర్చ జరిగింది. యూజీ కేబుల్ విధానం, వెండర్ విధానం వంటి కొత్త నిబంధనలు కాంట్రాక్టర్లకు అడ్డంకిగా మారాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని, తెలంగాణ వ్యాప్తంగా తనిఖీ పద్ధతి చేసే కాంట్రాక్టర్లకు సెక్షన్ కాంట్రాక్టర్ విధానం అమలు చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా నక్క యాదగిరి మాట్లాడుతూ..విద్యుత్ శాఖ స్టోర్లలో మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడం, క్షేత్రస్థాయిలో పనులు పూర్తయినా లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) ఇవ్వకపోవడంతో వినియోగదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడూ లేవని, టెండర్లు సజావుగా జరిగేవని పేర్కొన్నారు. నిరుద్యోగులుగా మారిన కాంట్రాక్టర్లను ప్రోత్సాహించాల్సింది పోయి, కొత్త నిబంధనల పేరుతో ఇబ్బందులు కల్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్త స్టోర్లలో ఒక సామగ్రి ఉంటే మరొకటి లేకపోవడంతో పనులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఎల్సీ సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం కాంట్రాక్టర్ల ఆందోళనలను పట్టించుకోవడం లేదని, చాలా చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆలోచన చేయాలని సభను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలూరు మహేందర్, నామిని వెంకటేష్ నేత, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగయ్య, రాజు మహారాజ్, జీడిమెట్ల డివిజన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఎల్సీ (సికింద్రాబాద్ డివిజన్) జనరల్ సెక్రటరీ అశోక్, కాంట్రాక్టర్లు భరత్ రెడ్డి, మనోహర్, బాల్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడు ఏ. మహేందర్, అధ్యక్షుడు ఎం. కనకాచారి, ప్రధాన కార్యదర్శి ఆర్. ప్రదీప్ రెడ్డి, కోశాధికారి రాజు, ఉపాధ్యక్షులు వి. సత్యనారాయణ, వి. నవీన్, సంయుక్త కార్యదర్శులు గణేష్, నరేందర్ రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, నారాయణరెడ్డి, మనోహర్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
