
ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత.. తెలంగాణ సాహితీలోకానికి తీరని లోటు
హైదరాబాద్, నవంబర్ 10 (VGlobe News): తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (డా. అందెశ్రీ) ఆకస్మిక మరణం పట్ల రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిన ఆయనను కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, ఉదయం 7 గంటల 20 నిమిషాలకు చేరుకున్నారు. 7 గంటల 25 నిమిషాలకు డాక్టర్లు మరణాన్ని ప్రకటించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స సాగించినా ఫలితం లేకపోయింది.
అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలకు ఎప్పటికీ పూడ్చలేని లోటుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర సాధనలో కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచిందని, స్వరాష్ట్ర ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఒక్కతాటిపై నిలిపి స్ఫూర్తిని నింపిందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపొందించిన సందర్భంలో అందెశ్రీతో పంచుకున్న ఆలోచనలు, వ్యక్తిగత అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలినట్టు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయన కృషి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రెటరీకి నిర్దేశించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాంస్కృతిక ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని, తనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. రాష్ట్రానికి తీరని లోటని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఉద్యమంలోని అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మలిదశ ఉద్యమ కెరటంగా, చారిత్రక గీతం రచించిన మహనీయుడిగా కొనియాడారు. ఆయన కలం నుండి వచ్చిన ప్రతి పదం తెలంగాణ చరిత్రకు సాక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ప్రజాకవి, ఉద్యమ నాయకుడిగా అశ్రు నివాళులర్పించారు. అందెశ్రీ సాహితీ సంపద, ముఖ్యంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఉన్నంత కాలం ఆయన చిరస్మరణీయులుగా నిలుస్తారని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
https://youtu.be/8Qbr3amBTcs?si=trwTcrA2NszL4MWm
ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ
గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా (నేడు సిద్దిపేట జిల్లా) రేబర్తిలో జననం
జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ
ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన ప్రభుత్వం
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్
అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట
2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు
2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న అందెశ్రీ
2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం
2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
లోక్ నాయక్ పురస్కారం అందుకున్న అందెశ్రీ
ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్టు వైద్యులప్రకటన
రేపు అంత్యక్రియలు
ప్రజల సందర్శనార్ధం కవి అందెశ్రీ భౌతిక కాయం లాలాగూడ జీహెచ్ ఎంసీ ఆచార్య జయశంకర్ గ్రౌండ్స్ లో ఉంచారు.
సాయంత్రం 5 గంటలకు ఘట్ కేసర్ లో నిర్మాణంలో వున్న తన సొంత ఇంటికి తరలిస్తారు. రేవు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
