
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 13:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. ఈ నెల 11న పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రేపు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా ఆర్వో కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను 10 రౌండ్లలో లెక్కిస్తామన్నారు. 58 మంది అభ్యర్థులు పోటీ చేసినందున ప్రత్యేక అనుమతి తీసుకుని 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లెక్కింపు పనుల కోసం 186 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుందని, అనంతరం ఇలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని వివరించారు.

ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తామని, మీడియా సౌకర్యార్థం ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భద్రతా ఏర్పాట్లపై నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, లెక్కింపు కేంద్రాల వద్ద 250 మంది పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. అదనంగా 15 ప్లాటూన్ల ఫోర్స్ మోహరించనున్నట్లు వెల్లడించారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అనుమతి ఉన్నవారికే లెక్కింపు కేంద్ర ప్రవేశం ఉంటుందని, శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రేపు ఉదయం నుంచే జూబ్లీహిల్స్ ఫలితాల లెక్కింపు రాజకీయ ఉత్కంఠను మరింత పెంచనుంది.
