
– 16 కంపెనీలు భారత నేలపై కార్యకలాపాలు!
గ్రేట్ ప్లేస్ టు వర్క్ – ఫార్చ్యూన్ మీడియా సంయుక్త నివేదిక
న్యూఢిల్లీ, నవంబర్ 13:
ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారత్ ప్రభావం మరింతగా విస్తరిస్తోంది. పని చేయడానికి అత్యుత్తమ కార్యాలయాల జాబితాలో భారత ఆధిపత్యం స్పష్టమైంది. ఫార్చ్యూన్ విడుదల చేసిన ‘వరల్డ్‌స్ బెస్ట్ వర్క్‌ప్లేసెస్ 2025’ జాబితాలో టాప్ 25 కంపెనీలలో ఏకంగా 16 సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 90 లక్షల మంది ఉద్యోగుల సర్వే ఆధారంగా గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థ, ఫార్చ్యూన్ మీడియా సంయుక్తంగా ఈ జాబితాను రూపొందించాయి. దాదాపు 2.5 కోట్ల మంది ఉద్యోగుల అనుభవాలకు ప్రాతినిధ్యం వహించే ఈ విశ్లేషణలో, ఉద్యోగుల విశ్వాసం, గౌరవం, సాధికారత, స్నేహపూర్వక వాతావరణం వంటి అంశాలు ప్రాముఖ్యత సాధించాయి.
ఈ సందర్భంలో గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా సీఈఓ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ, “ప్రపంచ అత్యుత్తమ 25 సంస్థలలో 16 కంపెనీలు భారత్‌లో బలంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇది భారత్ ప్రపంచ వర్క్‌ప్లేస్ కల్చర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని నిరూపిస్తోంది,” అని తెలిపారు.
గ్రేట్ ప్లేస్ టు వర్క్ గ్లోబల్ సీఈఓ మైఖేల్ సి. బుష్ మాట్లాడుతూ, “గొప్ప కంపెనీలు సరిహద్దులు దాటి ప్రభావం చూపగలవు. ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమను కంపెనీ నమ్ముతుందని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలని కోరుకుంటుందని భావిస్తున్నారు. ఇది నిజమైన వర్క్‌ప్లేస్ కల్చర్‌కు నిదర్శనం,” అని అన్నారు.

ఫార్చ్యూన్ ఎడిటర్-ఇన్-చీఫ్ అలిసన్ షోన్‌టెల్ మాట్లాడుతూ, “ఈ జాబితా ఉద్యోగుల దృష్టిలో నేటి అసాధారణమైన కార్యాలయాలను ప్రతిబింబిస్తోంది. నమ్మకం, సాధికారత కలిసిన చోటే ఉత్తమ పనితీరు వెలసుతుంది,” అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ వర్క్‌ప్లేస్ సంస్కృతిలో భారత కంపెనీల సత్తా మరొక్కసారి రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా “వర్క్ టు లివ్, లివ్ టు వర్క్” అనే భావనకు భారతీయ మానవ మూలధనం కొత్త అర్థం ఇస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
