
శంషాబాద్‌లో విషాద ఛాయలు ఐవీఎఫ్ ఆశలు కమ్మేసిన అనర్థం
కవలల మరణం–భార్య మృతి
–భర్త ఆత్మహత్య…
రెండు రోజుల్లో నలుగురి ప్రాణాలు బలి
శంషాబాద్, నవంబర్ 18:
ఇంటిని ఆనందంతో నింపాల్సిన కవల శిశువుల రాక… చివరికి ఓ కుటుంబాన్ని పూర్తిగా చిదిమేసింది. ఐవీఎఫ్ చికిత్స ద్వారా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు రెండు రోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలు బంధువులను, అప్రాంత వాసులను తీవ్ర విషాదంలో ముంచేశాయి.
శంషాబాద్‌లో నివసిస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉద్యోగి ముత్యాల విజయ్ (40), ఆయన భార్య శ్రావ్య (35) బెంగళూరుకు చెందినవారు. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ కారణంగా హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడిన వీరికి ఐవీఎఫ్ చికిత్స ఫలించి, శ్రావ్య ఎనిమిది నెలల గర్భంతో కవల శిశువులను మోస్తోంది.
అయితే నవంబర్ 16 రాత్రి శ్రావ్యకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అత్తాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో కవల శిశువులు గర్భంలోనే మృతి చెందినట్లు తేలడంతో ఆమె మానసికంగా తీవ్ర షాక్‌కు గురైంది. స్పృహ తప్పిన శ్రావ్యను వెంటనే గుడిమల్కాపూర్‌లోని మరో ప్రముఖ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచింది.
భార్య మృతదేహాన్ని చూసిన విజయ్ మానసికంగా పూర్తిగా కూలిపోయారు. జీవితంపై వేసుకున్న ఆశలన్నీ ధ్వంసమైన నేపథ్యంలో, నవంబర్ 17 తెల్లవారుజామున శంషాద్‌లోని నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనపై శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. బాల్‌రాజ్ మాట్లాడుతూ— మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవలి వరకు నవజీవితానికి సిద్ధమవుతున్న ఈ కుటుంబం… ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. నిన్నటి వరకు సంతోష కిలకిలలతో మార్మోగాల్సిన ఇల్లు… ఇప్పుడు కన్నీటి సముద్రంగా మారి బంధువులను, స్నేహితులను కలచివేస్తోంది.
