
ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్
హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా పాఠశాలల నుంచి వచ్చిన 5,000 మందికిపైగా విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా నిలిచిన ‘తెలంగాణ ఇంటర్-స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2025’ బుధవారం సాయంత్రం ఎల్‌బీ నగర్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది.
జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, చదరంగం, కిక్‌బాక్సింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, టేక్వాండో, వూషు, కరాటే, ఖో-ఖో, జంప్ రోప్ వంటి 11 విభాగాల్లో విద్యార్థులు తనతన ప్రతిభను ప్రదర్శించి క్రీడా రంగాన్ని కళకళలాడించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ— “క్రీడల్లో గెలుపు–ఓటమి రెండూ సహజం. అయితే విజయం–పరాజయాలకతీతంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగల సామర్థ్యం కలిగినవారే. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మరింతగా కృషి చేయాలి. క్రీడలకు పెద్దఎత్తున నిధులు కేటాయించడం ద్వారాే భవిష్యత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దవచ్చు” అని పేర్కొన్నారు.
సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్ మాట్లాడుతూ— “విద్యతో పాటు క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల్ని పెంపొందిస్తాయి. ఈ ఛాంపియన్‌షిప్ తెలంగాణలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్తుందని నమ్మకం. ప్రధాని మోదీ దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సమయంలో, ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు ప్రభుత్వాలు మరింత బలమైన అండగా నిలవాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని కుంచెట్టి మహేష్ సమన్వయం చేయగా, ఆర్గనైజింగ్ చైర్మన్ ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వి. శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీవాణి, గిరివర్ధన్, బుల్లెట్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్ల ప్రదానం, అనంతరం నిర్వహించిన అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
