
ఒక్కసారిగా పులకించిన తిరుచానూరు మాడవీధులు ! 🙏✨
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు: కల్కి అవతారంలో అశ్వవాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు
తిరుపతి, నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ పద్మావతి అమ్మవారు కల్కి అవతార అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.


రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించారు. వాహనసేవలో భాగంగా ముందుగా గజరాజులు నడిచి, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు ఘనంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుని కృతార్థులయ్యారు.

అశ్వవాహన సేవ ప్రత్యేకత గురించి ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన విషయం ప్రకారం, అశ్వం వేగవంతమైన జంతువు కాగా, ఉపనిషత్తులలో ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించారు. పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించుకున్న భక్తులకు కలియుగ దోషాలు తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.


ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, శ్ టి. జానకి దేవి, నరేష్ కుమార్, ఎం. శాంతారాం, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 1వ తేదీ వరకు ఘనంగా కొనసాగనున్నాయి.

