
హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ ప్రారంభం: తెలంగాణ అభివృద్ధిలో మైలురాయి – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 26: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఎయిరోస్పేస్ సంస్థ సాఫ్రన్ (SAFRAN) ఏర్పాటు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా (SAESI) ఫెసిలిటీ సెంటర్‌ను సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్‌ఈజెడ్)లో నెలకొల్పిన ఈ అత్యాధునిక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొని, దీనిని రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా అభివర్ణించారు.
“దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసులను అందించే ఈ సెంటర్ హైదరాబాద్‌ను ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా నిలుపుతుంది. సాఫ్రన్ గ్రూప్ తెలంగాణపై చూపిన నమ్మకం ఎంతో గర్వకారణం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బెంగళూరు-హైదరాబాద్‌ను ‘డిఫెన్స్ & ఎయిరోస్పేస్ కారిడార్’గా ప్రకటించాలని ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాఫ్రన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

దాదాపు రూ.1300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో నిర్మితమైన ఈ ఫెసిలిటీతో పాటు, రాఫెల్ యుద్ధ విమానాలకు చెందిన ఎం88 మిలటరీ ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ (MRO) కేంద్రానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఈ MRO సౌకర్యం భారత వైమానిక దళం, నౌకాదళ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తుందని సీఎం తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.
“తెలంగాణలో అమలవుతున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, దేశంలోనే ఉత్తమమైన ఎస్‌ఎంఈ పాలసీ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది ఎయిరోస్పేస్ ఎగుమతులు రెట్టింపు కాగా, ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే రూ.30 వేల కోట్లు దాటాయి. ఇది ఫార్మా ఎగుమతులను అధిగమించింది” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ విజయానికి గుర్తింపుగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణకు అవార్డు లభించినట్టు ఆయన తెలిపారు.

నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వివరిస్తూ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమాన నిర్వహణ శిక్షణ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల్లో నిర్మాణంలో ఉన్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి, డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు పెట్టుబడిదారులను ఆహ్వానించారు. “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు-ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈఓ ఒలివర్ అండ్రీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సీఈఓ స్టీఫెన్ క్యూయెల్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తదితరులు పాల్గొన్నారు.
