
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 1,20,579 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వెల్లడించారు.
లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత 11 ఏళ్లలో రైల్వే శాఖ మొత్తం 5.08 లక్షల ఉద్యోగాలను సృష్టించగా, అంతక్రితం పదేళ్లలో కేవలం 4.11 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని పోల్చి చూపారు. దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కావడం, నిరంతరాయంగా విస్తరిస్తున్న సేవలు, సాంకేతిక మార్పులు, భద్రతా ప్రమాణాల అమలు కారణంగా నియామకాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

2024లో ఇప్పటివరకు పురోగతి
ఈ ఏడాది 92 వేలకుపైగా పోస్టులకు 10 కీలక నోటిఫికేషన్లు (CEN) విడుదలయ్యాయి. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP), టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్, NTPC, RPF సబ్-ఇన్‌స్పెక్టర్-కానిస్టేబుల్, లెవల్-1 ట్రాక్ మెయింటైనర్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి.
ఇప్పటివరకు 59,678 పోస్టులకు మొదటి దశ CBT పరీక్షలు పూర్తయ్యాయి. ALP, JE, NTPC పోస్టులకు రెండో దశ CBT, ALPలకు CBAT కూడా ముగిసింది. 32 వేలకుపైగా లెవల్-1 ఖాళీల ఎంపిక ప్రక్రియ నవంబర్ 2025 నుంచి ప్రారంభమైంది. RPF కానిస్టేబుల్ 4,208 పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు ప్రారంభమైనట్టు మంత్రి తెలిపారు.

2025లో కొత్త నోటిఫికేషన్లు
వచ్చే ఏడాది కోసం ఇప్పటికే 28,463 పోస్టులకు ఏడు నోటిఫికేషన్లు విడుదలైనట్టు రైల్వే శాఖ వెల్లడించింది.
అన్ని పరీక్షలు పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని, పేపర్ లీక్ లేదా ఇతర అక్రమాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేసింది.

అభ్యర్థుల సౌలభ్యం కోసం 2024 నుంచి ‘వార్షిక నియామక క్యాలెండర్’ను అమలు చేస్తున్నారు. దీని వల్ల పరీక్షలు, ఫలితాలు, శిక్షణ, జాయినింగ్ తేదీలు ముందుగానే తెలుస్తాయి. తాత్కాలిక కాంట్రాక్టు నియామకాలు కేవలం అత్యవసర పనులకు మాత్రమేనని, అవి శాశ్వత ఉద్యోగాలుగా మారవని మంత్రి స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా యువతకు ఈ నియామకాలు భారీ ఉపశమనం కాబోతున్నాయన్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ మేగా డ్రైవ్‌ను వేగవంతం చేస్తోంది.
