
హైదరాబాద్, జూలై 22:
హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం (గాంధీభవన్) ఎదుట బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తమ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ తీవ్రంగా ఖండించింది. గాంధీభవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని, అనంతరం వారిని పోలీసు వాహనాల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత నిరసనలు తెలియజేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య గొంతును అరెస్టులతో అణచివేయాలని ప్రయత్నించడం సరైంది కాదని విమర్శించారు. రాజకీయ విభేదాలను పోలీసు చర్యలతో ఎదుర్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.


