
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పెట్టుబడుల వరద …
దేశం షాక్, ప్రపంచం ఆశ్చర్యం!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలి రోజే రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు
హైదరాబాద్, డిసెంబర్ 8: భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ తొలి రోజునే చారిత్రక విజయం సాధించింది. ఒక్క రోజులోనే 35కి పైగా ఎంఓయూ (మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్)లపై సంతకాలు జరగడంతో రూ.2.43 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రాష్ట్రానికి అందే అవకాశం కలిగింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ & డిఫెన్స్, బయోటెక్, టెక్స్‌టైల్స్, సినిమా-మీడియా, విద్యా రంగాల్లో ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించింది.

ముఖ్య పెట్టుబడి ఒప్పందాలు
- బ్రూక్‌ఫీల్డ్-యాక్సిస్ వెంచర్స్ కూటమి – రూ.75,000 కోట్లతో గ్లోబల్ ఆర్&డీ, డీప్‌టెక్ హబ్
- ఈవ్‌రెన్ యాక్సిస్ ఎనర్జీ – రూ.31,500 కోట్లతో సోలార్, విండ్ మెగా ప్రాజెక్టులు
- విన్ గ్రూప్ – రూ.27,000 కోట్లతో పునరుత్పాదక ఇంధనం, ఈవీ ఇన్‌ఫ్రా
- జీఎంఆర్ గ్రూప్ – రూ.15,000 కోట్లతో ఏరోస్పేస్, డిఫెన్స్, కార్గో విస్తరణ
- మెఘా ఇంజనీరింగ్ – రూ.8,000 కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు
- రెన్యూసిస్, మిడ్‌వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ – రూ.7,000 కోట్లతో ఎలక్ట్రానిక్స్, హైడ్రోజన్ టెక్
- కృష్ణా పవర్ యుటిలిటీస్ – రూ.5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
- సీతారాం స్పిన్నర్స్ – రూ.3,000 కోట్లతో టెక్స్‌టైల్ యూనిట్
- అల్ట్రా బ్రైట్, రెయిన్ సిమెంట్స్ – రూ.2,000 కోట్లతో సిమెంట్ విస్తరణ
- అపోలో మైక్రో సిస్టమ్స్ – రూ.1,500 కోట్లతో డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీ
- SIDBI – రూ.1,000 కోట్లతో స్టార్టప్‌లకు ఫండింగ్
- వరల్డ్ ట్రేడ్ సెంటర్ – రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ హబ్

ఈ పెట్టుబడుల ద్వారా లక్షలాది నాణ్యమైన ఉద్యోగాలు, సుస్థిర మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఏర్పడనున్నాయి.
“ప్రజల విశ్వాసమే ఈ విజయానికి మూలం”
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, ప్రో-ఇండస్ట్రీ విధానాలపై దేశీయ-అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనం. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి నాణ్యమైన ఉపాధిగా, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలుగా మారుతుందనే హామీ ఇస్తున్నాం” అని అన్నారు.
పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “డీప్‌టెక్ సిటీ నుంచి టెక్స్‌టైల్ యూనిట్ వరకు అన్ని రంగాల్లో వైవిధ్యమైన పెట్టుబడులు రావడం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానం ప్రపంచానికి చాటిచెప్పిన సందేశం” అని పేర్కొన్నారు.

పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ “ఈ భారీ పెట్టుబడులు ‘తెలంగాణ రైజింగ్ – విజన్ 2047’ లక్ష్యం వైపు బలమైన పునాదులు వేస్తాయి” అని అన్నారు.
సమ్మిట్ రెండో రోజు కూడా అనేక కీలక ఒప్పందాలు, సెషన్లతో కొనసాగనుంది.
