
కుడి కాలికి సర్జరీ విజయవంతం
హైదరాబాద్: సీనియర్ నటుడు, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. నవంబర్ 25న మేడ్చల్ సమీపంలో ఓ కొత్త చిత్రం యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తుండగా ఆయన కుడి కాలికి బలమైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం… మడమ దగ్గర ఎముక బయటకు వచ్చేంత తీవ్రంగా గాయం కావడంతో సుమారు మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగింది. సర్జరీలో కాలిలో ప్లేట్స్ మరియు వైర్‌లు అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతమైందని, రాజశేఖర్ రికవరీలో ఉన్నారని యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
వైద్యుల సూచన మేరకు మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ముఖ్యంగా గాయమైన కాలును భూమికి తగలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. దీంతో రాజశేఖర్ జనవరి 2026 వరకు చిత్రీకరణలకు దూరంగా ఉండనున్నారు.
గమనార్హమైన విషయం ఏమిటంటే… రాజశేఖర్‌కు ఇది మొదటిసారి కాదు. ఖచ్చితంగా 35 ఏళ్ల క్రితం 1989 నవంబర్ 15న ‘మగాడు’ సినిమా షూటింగ్‌లో ఎడమ కాలికి గాయం కాగా, ఇప్పుడు మళ్లీ నవంబర్ నెలలోనే కుడి కాలికి గాయం అయింది. గాయాలను సైతం లెక్కచేయకుండా స్వయాన్స్‌లు స్వయంగా చేసే ధైర్యం ఆయనలో ఇప్పటికీ కొనసాగుతోంది.
ప్రస్తుతం రాజశేఖర్ చేతిలో ‘బైకర్’ అలాగే మరో రెండు అనౌన్స్‌మెంట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి. రికవరీ పూర్తయిన తర్వాత ఈ మూడు చిత్రాల షూటింగ్‌లు పునఃప్రారంభమవుతాయని యూనిట్ తెలిపింది.
త్వరగా కోలుకోవాలని రాజశేఖర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.

