
ఎర్ర జెండాలతో ఖమ్మంలో కదం తొక్కనున్న కమ్యూనిస్టులు
హైదరాబాద్, జనవరి 11 (ప్రతినిధి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా ముగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలోని ఎస్‌ఆర్‌బిజి ఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాది మంది పాల్గొనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఈ సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహా వామపక్ష పార్టీల అగ్రనేతలు, సుమారు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు.

సిపిఐ వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో జర్నలిస్టులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, “భారతదేశంలో కమ్యూనిజం ఎక్కడుందనే ప్రశ్నలకు ఈ ఖమ్మం సభ ఒక రుజువుగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా రవాణా సౌకర్యాలు కల్పించుకుని తరలివస్తున్నారు” అని వివరించారు. సభకు ముందు పదివేల మందితో ‘జనసేవాదళ్ కవాతు’ నిర్వహించి, ఆ తర్వాత సభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరుసటి రోజు అంటే 19న జాతీయ సదస్సు, అలాగే 19, 20, 21 తేదీల్లో సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం, కార్యవర్గ సమితి సమావేశాలు జరగనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ, “సిపిఐ 99వ సంవత్సరం నుంచి వందేళ్లు పూర్తి చేసుకునే వరకు ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రయత్నిస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు ముందుగా కమ్యూనిస్టులనే గుర్తుచేసుకుంటారు. ఖమ్మం సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారు” అని అన్నారు.

సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ, “కమ్యూనిస్టు పార్టీలు వందేళ్లలో ఏమీ సాధించలేదని కొందరు హేళన చేస్తున్నారు. కానీ, అధికారంలోకి రాకపోయినా భారత సమైక్యతను కాపాడాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం, మౌలిక అంశాలను సాధించాం. స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్య్రం ప్రతిపాదన చేసింది సిపిఐయే. దున్నేవాడికి భూమి, పేదలకు హక్కు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి ఉద్యమాలు మా నిర్మాణమే. దేశాన్ని ముక్కలు చేయనివ్వబోమని నినదించింది కమ్యూనిస్టు పార్టీ. భవిష్యత్తు ప్రజలదే, కమ్యూనిస్టు పార్టీదే” అని స్పష్టం చేశారు.
కూనంనేని సాంబశివరావు మరిన్ని వివరాలు పంచుకుంటూ, “కమ్యూనిస్టు సిద్ధాంతానికి భిన్నంగా కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. భారతదేశంలో తాజా రాజకీయ పరిణామాలు, కగార్ ఆపరేషన్, నాలుగు లేబర్ కోడ్‌లు వంటి సమస్యల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఐక్యమవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని తెలిపారు. ఈ సభ ద్వారా సిపిఐ తన చారిత్రక ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్ దిశను నిర్దేశించనుంది.
