
అగ్రికల్చర్ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం
నలుగురు సిబ్బంది సస్పెన్షన్ వేటు
35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థుల డిస్మిస్
హైదరాబాద్, జనవరి 08
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనిరవ్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయిన ఘటనపై వర్సిటీ వీసీ అల్డాస్ జానయ్య సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసారు . ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఇన్ సర్వీస్ కోటాలో చదువుతున్న దాదాపు 35 మంది బీఎస్సీ (అగ్రికల్చర్) మూడో సంవత్సరం అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని వ్యవసాయ శాఖకు తిరిగి పంపిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టేందుకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు.
కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ చేపట్టి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ, ఇన్ సర్వీస్ కోటాలో వర్సిటీలో మూడో సంవత్సరం బీ.ఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న దాదాపు 35 మంది అభ్యర్థులు, వర్సిటీ సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలను ముందుగానే లీక్ చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర అగ్రికల్చర్ కాలేజీల విద్యార్థులకు పంపినట్లు తేల్చింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు, ఒక పథకం ప్రకారం కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు కమిటీ నిర్ధారించింది.

ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన వర్సిటీ, ఒక ఉన్నతాధికారితో పాటు నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన దాదాపు 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
