
అన్నార్థుల ఆకలి కేక.. నిర్భాగ్యుల నిప్పు కణిక
నేడు అలిశెట్టి జయంతి
కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి: అక్షరాలతో సమాజానికి వెలుగులు అందించిన యోధుడు
హైదరాబాద్, జనవరి 12: తెలుగు సాహిత్య రంగంలో అరుదైన మణిపూసల్లాంటి కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి ఒకే రోజున జరుగుతుండటం యాదృచ్ఛికమే అయినా, ఆయన జీవితం మాత్రం సమాజ చైతన్యానికి స్ఫూర్తిదాయకం. 1956 జనవరి 12న కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అలిశెట్టి చినరాజం-లక్ష్మి దంపతులకు జన్మించిన ప్రభాకర్, కేవలం 39 ఏళ్ల స్వల్ప జీవితకాలంలోనే తన కవిత్వంతో సమాజంలో శాశ్వత ముద్ర వేశారు. ఆయన కవితలు కేవలం సాహిత్యంగా మాత్రమే కాకుండా, దోపిడీ, అన్యాయాలపై పోరాడే ఆయుధాలుగా మారాయి.
పదో తరగతి వరకు కరీంనగర్‌లో, ఇంటర్ సిద్ధిపేటలో చదివిన ప్రభాకర్, యుక్త వయసులోనే మినీ కవిత్వంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. జగిత్యాల రైతాంగ జైత్రయాత్ర సమయంలో ఆయన కవితలు పెత్తందార్ల దోపిడీపై మంటల జెండాలుగా మారి, పోరాట యోధులకు ప్రేరణనిచ్చాయి. “అన్నార్థుల ఆకలి కేక.. నిర్భాగ్యుల నిప్పు కణిక” వంటి పంక్తులు ఆయన సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి. మినీ కవిత్వంలో చిన్న పదాలతో అనంతార్థాలు చెప్పగలిగే శక్తి ఆయన సొంతం.

ప్రభాకర్ కవిత్వం సమాజ వ్యవస్థలోని వైఫల్యాలను సూటిగా ప్రశ్నిస్తుంది. “పరిష్కారం” వంటి రచనలు చదివేవారిలో ఆలోచనతో పాటు అసహనాన్ని కూడా రగిలిస్తాయి. “నీ లైఫ్‌ని బ్యూటిఫుల్ పెయింటింగ్‌గా మార్చుకోవడానికి అట్రాక్టివ్ కలర్ రెడ్ కోసం రక్తం మాత్రం ఎవరిదీ ఉపయోగించకు” అంటూ మనిషి స్వార్థాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలపై “ఓటు నీ పచ్చి నెత్తురు మాంసం ముద్ద… ఓ గద్దకి చూస్తూ చూస్తూ వేయకు” అని హెచ్చరించారు. మూఢనమ్మకాలపై “గుడి – శనివారం – అదొక షోరూమ్” అంటూ విరుచుకుపడ్డారు.
నియంతృత్వం, పేదరికం, ఆకలి, అసమానతలు ఆయన కవితలకు మూలాలు. “నియంతృత్వపు తుపాకీ గొట్టం పైన భూగోళాన్ని ఆపడం భ్రమ” అంటూ అణచివేతలు శాశ్వతం కావని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తుపై “పిల్లలు నేటి సీమటపాకాయలే… రేపటి ఆటం బాంబులు” అని హెచ్చరించారు. రాజకీయాలను వ్యంగ్యంగా చిత్రిస్తూ “ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట… ఈ కట్టు కథల్ని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి” అని ప్రజల అమాయకత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలపై “ప్రభుత్వాసుపత్రి పనికిరాదు… ప్రైవేటు భరించరాదు – మరి రోగం కుదిరేదెట్లా?” అంటూ విమర్శించారు. అసమానతలపై “గరీబోడి చేతికందని తందూరి రోటీ… నగరాకాశంలో రాత్రంతా చందమామ బ్యూటీ” అని కవితగా మలిచారు. అనారోగ్యం బాధించినా, సినిమా అవకాశాలు వచ్చినా ప్రజాసాహిత్యాన్ని వదలకుండా సమాజ చైతన్యానికి కట్టుబడ్డారు. భార్య భాగ్యలక్ష్మి జీవితాంతం ఆయనకు తోడుగా నిలిచారు.
భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రభాకర్ కవిత్వం ఇప్పటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూ, చైతన్యపరుస్తూ ఉంది. ఆయన చెప్పినట్టుగా “మరణం ఆయన చివరి చరణం కాదు.” నేటి యువతరం ఆయన రచనలను చదివి స్ఫూర్తి పొందాలని సాహిత్యవేత్తలు పిలుపునిస్తున్నారు.
