
పండగ సందర్భంగా పెరిగిన ధరలు
చికెన్ రూ.350, మటన్ వెయ్యి నుంచి రూ.1200
చికెన్ రూ.350, మటన్ రూ.1200కు ఎగబాకిన ధరలు
మటన్ ధరల పరుగుకు బ్రేక్ ఎక్కడ?
పండుగ రోజుల్లో 400 టన్నుల అమ్మకాలు
హైదరాబాద్, జనవరి 16
పండుగలు వచ్చాయంటే ముక్కలేనిదే ముద్ద దిగదన్నట్లు రాష్ట్రవ్యాప్తంగా మాంసాహారానికి గిరాకీ పెరుగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చికెన్, మటన్ వినియోగం భారీగా పెరగడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో కేజీ మటన్ ధర రూ.1050 నుంచి రూ.1200 వరకు పలుకగా, చికెన్ ధర రూ.300 నుంచి రూ.350 దాకా పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో రేట్లు కొనసాగడం గమనార్హం. గత నెల వరకు రూ.230–240 మధ్య ఉన్న చికెన్ ధరలు పండుగ డిమాండ్‌తో ఒక్కసారిగా రూ.350కు చేరాయి. మటన్ ధరలు రూ.800 స్థాయి నుంచి ఇప్పుడు రూ.1050–1200 దాకా పెరిగాయి. నాటు కోళ్లకు డిమాండ్ అధికంగా ఉండడంతో వాటి ధర కిలో రూ.500 నుంచి రూ.650 వరకు పలుకుతోంది. గ్రామ దేవతలకు కోళ్లను సమర్పించే సంప్రదాయం, సరఫరా తక్కువగా ఉండటం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరలు కొండెక్కడంతో చాలా మంది సీఫుడ్‌వైపు మొగ్గు చూపారు. మకర సంక్రాంతి, కనుమ పండుగ వేళ ఫిష్ మార్కెట్లు రద్దీగా మారాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు కొనుగోలు చేయడానికి జనం బారులు తీరారు. పండుగ అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచేశారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగలతో పాటు డిమాండ్ పెరుగుతూనే ఉండగా, సరఫరా తగిన స్థాయిలో లేకపోవడం వల్ల ధరలపై నియంత్రణ కష్టమవుతోందని నిపుణులు అంటున్నారు. పండుగ ఆనందం మధ్య మాంసం ధరల మంట సామాన్యుల జేబును గట్టిగా తాకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మటన్ ధరల పరుగుకు బ్రేక్ ఎక్కడ?
రాష్ట్రంలో గొర్రె మాంసానికి ప్రత్యేకమైన గిరాకీ ఉంది. అందుకే ప్రతి ఏటా మటన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2018లో కేవలం రూ.560–580 మధ్య ఉన్న మటన్ ధరలు నేడు రూ.1200 దాటాయి. బొక్కతో మటన్ కిలో రూ.1050 నుంచి రూ.1200 వరకు ఉండగా, బొక్క లేకుండా మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి మటన్ ధర కిలో రూ.2000 దాటినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేదని తెలుస్తోంది. 2021లో రికార్డు ధర రూ.280 ఉండగా గత 2024 నాటికి రూ.300 దాటింది, 2026 నాటికి నేడు అది రూ. 350కి చేరడం గమనార్హం. ఈ సీజన్లో కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి.

జాతీయ మాంస పరిశోధన సంస్థ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పండుగ రోజుల్లో సగటున 400 టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణలోనే దేశంలో అత్యధికంగా మాంసాహారం తీసుకునే వారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో మాంసాహారులు 61.86 శాతం ఉండగా, తెలంగాణలో ఈ సంఖ్య 98.73 శాతంగా ఉంది. దేశంలో తినే మొత్తం మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే వినియోగమవుతుందని ఎన్‌ఆర్‌సీఎం గణాంకాలు వెల్లడించాయి. జాతీయ పౌష్టికాహార సంస్థ సూచన ప్రకారం ఒక్కో వ్యక్తి ఏడాదికి 12 కిలోల మాంసం తీసుకోవాలి. కానీ జాతీయ సగటు వినియోగం 2.9 నుంచి 3.26 కిలోల మధ్య ఉండగా, తెలంగాణలో ఒక్కో వ్యక్తి సగటున 9.2 కిలోల మాంసం తీసుకుంటున్నట్లు సర్వేలో తేలింది.
రాష్ట్రంలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 9.20 కిలోల మాంసం తీసుకుంటున్నాడు. అందులో గొర్రె మాంసం 4 కిలోలు, మేక మాంసం 1 కిలో, చికెన్ 3.5 కిలోలు, ఇతర మాంసాలు సుమారు ముప్పావు కిలో వరకు వినియోగిస్తున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏటా పెరుగుతున్న మటన్ ధరలు
2018 : రూ.560 – 580
2019 : రూ.600 – 620
2024 : రూ.800 – 850
2025 : రూ.1050 – 1200
