
తెలంగాణ రాజకీయాలు షేక్!
సంక్రాంతి టైంలో పలు దఫాల్లో సమావేశాలు..
కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ఫోకస్: ప్రశాంత్ కిషోర్ సహకారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆమెతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన ఉండవచ్చని సమాచారం.
రెండు నెలల వ్యవధిలో పీకే హైదరాబాద్‌కు వచ్చి కవితను రెండుసార్లు కలిశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు వారిద్దరూ సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు, ప్రజలు దానిని తమ సొంతంగా భావించి ఓన్ చేసుకునే విధానం, ప్రజా కోణంలో పార్టీ ఎలా పని చేయాలి అనే అంశాలపై లోతైన చర్చలు సాగినట్టు తెలుస్తోంది.
కవిత ఇప్పటికే ప్రజల కోణంలో పార్టీ విధానాలను రూపొందించేందుకు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో, పీకే సహకారంతో ఎన్నికల వ్యూహాలు, ప్రజా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలంగాణలో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
