హైదరాబాద్‌, మే 1: రాష్ట్రంలో నాన్-డొమెస్టిక్ (వాణిజ్య) ఎల్‌పీజీ ధరలు చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2026 మే 1 నుంచి అమలులోకి వచ్చిన తాజా ధరల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి వాణిజ్య రంగంపై భారీస్థాయిలో భారం పడనుంది. ఈ మేరకు తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (TLDA) ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.2,321 నుంచి రూ.3,315కి పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రూ.994 పెరుగుదల నమోదైంది. అలాగే 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.673 నుంచి రూ.914.50కు పెరిగి రూ.241.50 అధికమైంది. ఇతర నాన్-డొమెస్టిక్ సిలిండర్ల ధరలు కూడా కిలోకు రూ.122 నుంచి రూ.175కు పెరిగినట్లు వెల్లడించింది.

ఈ పెరుగుదల ఎల్‌పీజీ చరిత్రలోనే అత్యధికమని TLDA పేర్కొంది. పెరిగిన ధరలు వాణిజ్య వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని, ముఖ్యంగా హోటల్ మరియు ఆహార రంగ సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో అన్ని వాణిజ్య వినియోగదారులు ఎల్‌పీజీ సిలిండర్లను అధీకృత డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా కొనుగోలు చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అధీకృత డిస్ట్రిబ్యూటర్ల వద్ద ప్రభుత్వ నిర్దేశిత ధరలకే సరఫరా జరుగుతుందని, అనధికారిక ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తే అధిక ధరలు చెల్లించే అవకాశం ఉందని హెచ్చరించింది.

అదేవిధంగా అధీకృత డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సరఫరా అయ్యే సిలిండర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి, సరైన పరిమాణంతో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అనధికార మార్గాల్లో కొనుగోలు చేసే సిలిండర్లలో తక్కువ నింపడం, నాణ్యత లోపాలు వంటి ప్రమాదాలు ఉండే అవకాశముందని తెలిపింది.

ఇక 5 కిలోల LPG సిలిండర్లు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని TLDA వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులు, వలస కార్మికులు, చిన్న కుటుంబాలకు ఇవి అనుకూలమని పేర్కొంది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో అధీకృత డిస్ట్రిబ్యూటర్ల వద్ద సులభంగా కొత్త కనెక్షన్ పొందవచ్చని తెలిపింది.

దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధీకృత పంపిణీ వ్యవస్థను వినియోగించాలని TLDA ప్రజలకు సూచించింది. రాష్ట్రంలో LPG సరఫరా పారదర్శకంగా, క్రమబద్ధంగా కొనసాగేందుకు తమ సభ్యులు కృషి చేస్తున్నారని అసోసియేషన్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text