
పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ధీమా”
హైదరాబాద్, మే 10: తెలంగాణలో కూడా త్వరలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన భారీ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, “అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్” అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయోత్సవ వాతావరణం తెలంగాణలో కూడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
సభ ప్రారంభంలో “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా” అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని, కార్యకర్తల నినాదాల మధ్య శాంతియుతంగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై విసుగుచెంది, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి పాలనకు ముగింపు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, అసోంలో వరుసగా మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో బెంగాల్‌లో బీజేపీకి పరిమిత స్థాయి మాత్రమే ఉండేదని, ఇప్పుడు భారీ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. ప్రజలు నియంతృత్వ రాజకీయాలను తిరస్కరించి, విశ్వాస రాజకీయాలను ఆదరిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాని, ప్రస్తుతం ఆ పార్టీ కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్, మావోయిస్టు భావజాలానికి దగ్గరైందని ఆరోపించారు. మావోయిస్టు హింసతో తెలంగాణ తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, రాష్ట్రంలో మావోయిస్టుల నిర్మూలనకు బీజేపీ పాలన అవసరమని వ్యాఖ్యానించారు.
దేశ అభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్ కీలక భాగస్వామ్యంగా మారాయని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తోందని తెలిపారు. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు దిశగా అడుగులు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. కార్ పూలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
మధ్యతరగతి ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు మానుకోవాలని సూచించారు. బంగారం కొనుగోళ్లను తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చన్నారు. వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించాలని పిలుపునిచ్చారు.
రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని అవలంబించాలని సూచించారు. డీజిల్ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్ల వినియోగాన్ని పెంచాలని చెప్పారు. “మేడ్ ఇన్ ఇండియా” ఉత్పత్తులను ప్రోత్సహించాలని, స్వదేశీ వస్తువుల వినియోగం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
