
న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో గల అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ నబీన్ మాట్లాడుతూ, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ ఎప్పటి నుంచో మద్దతుదారుగా ఉందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో అందించిన సంపూర్ణ మద్దతు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జాతీయ సభ్యుడు పెరిక సురేష్, ఎన్వీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం న్యూఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అనంతరం నితిన్ నబీన్‌ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, రాష్ట్ర సాధనలో ప్రముఖుల పాత్రను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు ఢిల్లీలోని తెలంగాణ వాసుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి.
