
పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు
మహబూబాబాద్, జూన్ 19: గురు-శిష్య బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా ఓ విశిష్ట కార్యక్రమం మహబూబాబాద్‌లో జరిగింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం తమకు విద్యాబోధన చేసిన గురువును మరువని పూర్వ విద్యార్థులు, ఆయన 91వ జన్మదిన వేడుకలను అనాథ పిల్లల మధ్య ఘనంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1978-79 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు ఆంగ్లం బోధించిన విశ్రాంత ఉపాధ్యాయుడు తాడూరు భాస్కరాచారి 91వ పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి మానుకోటలోని దైవకృప అనాథ పిల్లల ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులు కలిసి ఆశ్రమంలోని చిన్నారులతో కేక్ కట్ చేయించి, వారికి స్వీట్లు, చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పరకాల రవీందర్ రెడ్డి, మైస శ్రీనివాస్ మాట్లాడుతూ, భాస్కరాచారి బోధించిన తరగతులు పూర్తై 47 సంవత్సరాలు గడిచినా గురువు పట్ల తమకు ఉన్న గౌరవం, అభిమానం ఏమాత్రం తగ్గలేదన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమని, ఆ అనుబంధం జీవితాంతం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ప్రతి గురువుకు తన విద్యార్థులపై ప్రేమ, మమకారం ఉంటుందని, అదే విధంగా విద్యార్థులకు కూడా తమ గురువుల పట్ల ప్రత్యేకమైన ఆత్మీయత, గౌరవం ఉంటాయని అన్నారు. ఆ భావోద్వేగ బంధానికే ప్రతీకగా తమ గురువు 91వ జన్మదినాన్ని తోటి సహ విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. భాస్కరాచారి సారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాలె నాగేశ్వరరావు, పరకాల ఉపేందర్ రెడ్డి, వంగ మల్లిఖార్జున్, రామసహాయం వెంకట్ రెడ్డి, జూలకంటి ప్రభాకర్, పసునూరి విజయ్ కుమార్, కాలసాని బుచ్చిరెడ్డి, గీసగాని శ్రీనివాస్, వెన్ను భద్రినారాయణ, వాడపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గురువును గౌరవిస్తూ, అనాథ చిన్నారులతో ఆనందాన్ని పంచుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం అక్కడి వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. గురు-శిష్య సంబంధం కాలంతో చెరిగిపోదని మరోసారి ఈ వేడుక నిరూపించింది.
