ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: 

మహబూబ్‌నగర్, జూన్ 20 : డిజిటల్ సమాచార విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వార్తల ప్రచురణకు ముందు వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్‌-చెకింగ్‌) అత్యంత అవసరమని ప్రముఖ జర్నలిస్టు ముద్దం నరసింహస్వామి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో జిల్లా జర్నలిస్టుల కోసం శనివారం నిర్వహించిన ‘వార్తాలాప్’ మీడియా వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ పాలనలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. పీఐబీ హైదరాబాద్ మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి పీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముద్దం నరసింహస్వామి మాట్లాడుతూ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  (ఏఐ) యుగంలో జర్నలిజం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు, పాత్రికేయుల బాధ్యతలపై వివరించారు.  నైతిక విలువలు, ఖచ్చితత్వం, సమతుల్యతతో కూడిన వార్తా ప్రసారం ద్వారానే మీడియా విశ్వసనీయతను కాపాడుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలన సంస్కరణలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో మీడియా క్రియాశీల భాగస్వామిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

పీఐబీ అధికారి వర్గంటి గాయత్రి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా, విశ్వసనీయంగా చేరవేయడమే పీఐబీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు సరైన సమాచారం అందేలా పీఐబీ వంతెనలా పనిచేస్తోందన్నారు.

డిజిటల్ యుగంలో తప్పుడు సమాచార వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్ట్‌-చెకింగ్‌ ప్రాధాన్యంపై ఫ్యాక్ట్‌ చెక్‌ శిక్షకురాలు బీఎన్ సత్యప్రియ ప్రత్యేక అవగాహన కల్పించారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న జర్నలిస్టులు జర్నలిజం, సమాచార ప్రసారం, డిజిటల్ మీడియా ధోరణులపై నిపుణులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

జిల్లా ప్రజా సంబంధాల అధికారి పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సకాలంలో అందించడంలో మీడియా పాత్రను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి వర్క్‌షాప్‌లు దోహదపడతాయని అన్నారు.

బాధ్యతాయుతమైన జర్నలిజం, డిజిటల్ అక్షరాస్యత, ఫ్యాక్ట్‌-చెకింగ్‌ అవసరం, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో మీడియా పాత్రపై ఈ వర్క్‌షాప్ జర్నలిస్టులకు విలువైన అవగాహన కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text