జీఎంపీఎస్ ఆధ్వర్యంలో అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర ప్రారంభం
జనగామ, జూలై 4:
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని పురస్కరించుకుని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం “అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర” ప్రారంభమైంది. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దొడ్డి కొమరయ్య స్మారక స్థూపానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎంపీఎస్ ఏర్పాటై మూడు దశాబ్దాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఉద్యమంలో సేవలందించి అమరులైన నాయకుల త్యాగాలను స్మరించుకోవడం సంఘం బాధ్యత అని అన్నారు. గత 30 ఏళ్లుగా గొర్రెలు, మేకల పెంపకందారుల హక్కుల కోసం పోరాడిన అమరుల కుటుంబాలను కలిసి నివాళులర్పించడం ద్వారా వారి సేవలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.

యాత్రలో భాగంగా అమరులైన నక్క లింగయ్య, మోటే నర్సయ్య, తోట్టే పెద్ద మల్లయ్య, కన్నెబోయిన బిక్షపతి కుటుంబాలను యాత్ర బృందం పరామర్శించి నివాళులర్పించింది. కడవెండి గ్రామానికి చెందిన నక్క లింగయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని జూలకంటి రంగారెడ్డి కొనియాడారు. దుబ్బగుట్ట పరిరక్షణ ఉద్యమంలో అనేక నిర్బంధాలు, కేసులను ఎదుర్కొంటూ గ్రామ ప్రజలతో కలిసి పోరాడి గ్రానైట్ కంపెనీ నుంచి గుట్టను కాపాడడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

లింగాల ఘనపూర్ మండలం కళ్లెం గ్రామానికి చెందిన మోటే నర్సయ్య సంఘం ఆవిర్భావం నుంచి అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని గొల్ల, కురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. జనగామ మండలం సామీర్‌పేటకు చెందిన తోట్టే పెద్ద మల్లయ్య జీఎంపీఎస్ డివిజన్ అధ్యక్షుడిగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా సంఘ బలోపేతానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. గానుగుపహాడ్ గ్రామానికి చెందిన కన్నెబోయిన బిక్షపతి గ్రామస్థాయిలో సంఘ నిర్మాణం, సహకార సంఘాల ఏర్పాటు కోసం కృషి చేశారని తెలిపారు.
కార్యక్రమంలో జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, బొల్లం అశోక్, కడెం లింగయ్య, చల్ల మల్లయ్య, ఒజ్జ వినయ్, జనగామ జిల్లా గౌరవ అధ్యక్షుడు శాతం రమేష్, జిల్లా అధ్యక్షుడు మోటి దేవేందర్, జిల్లా కార్యదర్శి బాలరాజు, జి. యాదగిరి, మండల నాయకులు భూమండ్ల కుమారస్వామి, ముక్కెర గంగరాజు, అమరుడు నక్క లింగయ్య కుటుంబ సభ్యులు, ఉపసర్పంచ్ రేణుకతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
