
మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి టెండర్లు
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలోని తూర్పు ప్రాంతాల విమాన రాకపోకలకు కీలకంగా భావిస్తున్న మామునూరు (వరంగల్) విమానాశ్రయ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెండర్లు ఆహ్వానించింది. విమానాశ్రయంలో కొత్త దేశీయ టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, విద్యుత్ సబ్‌స్టేషన్, ఫైర్ స్టేషన్, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్‌తో పాటు అనుబంధ పనులను చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది.
ఈ పనులకు రూ.213.59 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇందులో రూ.178.07 కోట్లు నిర్మాణ వ్యయంగా, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మరమ్మతులు తదితరాలకు రూ.35.52 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాలకు జీఎస్టీ అదనం. టెండర్‌లో పాల్గొనే సంస్థలు రూ.6.41 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
18 నెలల్లో నిర్మాణం
విమానాశ్రయ అభివృద్ధి పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని టెండర్‌లో స్పష్టం చేశారు. నిర్మాణ కాలంలో రెండు రుతుపవన సీజన్లకు 60 రోజుల వర్షాకాల సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. సివిల్, ఎంఈపీ పనులతో పాటు నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన నిబంధనలను కూడా టెండర్‌లో పొందుపరిచారు.

నవంబర్ 3 వరకు బిడ్ల స్వీకరణ
టెండర్ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 14, 2026న ప్రచురించారు. సెప్టెంబర్ 15 నుంచి టెండర్ పత్రాల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 28న వరంగల్ విమానాశ్రయంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. బిడ్ల దాఖలు ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి ప్రారంభమై నవంబర్ 3, 2026 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాంకేతిక బిడ్లను నవంబర్ 9న ఉదయం 11 గంటలకు, ఆర్థిక బిడ్లను నవంబర్ 30న మధ్యాహ్నం 3 గంటలకు తెరవనున్నారు.
కొత్త టెర్మినల్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్, సబ్‌స్టేషన్ తదితర మౌలిక వసతుల నిర్మాణంతో మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు ముందడుగు వేయనున్నాయి.
