
రాజమహేంద్రవరం, మే 28: గడిచిన నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న రాష్ట్రంలో సైకో పాలనను సాగనంపుదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు సభలో ఆయన ప్రసంగించారు. చంద్రన్న అభివృద్ధి , సంక్షేమం చేస్తే… జగన్ అవినీతి చేస్తున్నాడని, చంద్రన్న నిలబెడితే జగన్ పగలగొడుతున్నాడని, చంద్రన్న హీరో అయితే జగన్ జీరో అని లోకేష్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ జెండా పట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో పనిచేస్తున్న పసుపు సైన్యం కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని లోకేష్ ప్రకటించారు. కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన వాళ్ళు అమెరికా నుంచి అమలాపురంలో ఎక్కడ ఉన్నా సరే, వదిలేది లేదని ఆయన అన్నారు.


తన పాదయాత్రను అడ్డుకోడానికి రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా జీవో తెచ్చారని ఆయన విమర్శించారు. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అని చెప్పానని, ఎవరూ అడ్డుకోలేక పోయారని లోకేష్ గుర్తుచేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. “ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు, ఎన్ని అడ్డంకులు కల్పించినా తగ్గేదెలా..” అంటూ యాత్ర సాగిస్తున్నానని లోకేష్ అన్నారు.

ఈ పాదయాత్రలో ప్రజలు కష్టాలు, కన్నీళ్లు తెలుసుకుంటున్నానని అన్నారు. జగన్ పాలనలో అన్ని ధరలు పెంచేసి, చెత్త మీద కూడా పన్ను వేశారని ఆయన పేర్కొంటూ రేపొద్దున మనం పీల్చే గాలిమీద కూడా పన్ను వేసినా ఆశ్చ్యర్య పోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. పేదలను దోచుకుంటున్న జగన్ సైకో .. ఈ సైకో పాలన పోయి, 2024లో చంద్రన్న పాలన వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తంచేశారు.