
– జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై చర్చ
హైదరాబాద్, వెలుగు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ, సలహాదారు మల్లిఖార్జున్‌రెడ్డి, సభ్యులు వేములపల్లి రాజు, ప్రతిభ దేవి, శ్రావణి తదితరులు ఎమ్మెల్సీ కవిత కలిశారు.
ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ‘డీజేహెచ్‌ఎస్’ అని ప్రతినిధులు వివరించారు. దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్న వారు తమ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ చొరువతోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ను కలిశామని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని ఆయన హామీయిచ్చిన విషయాన్ని డీజేహెచ్‌ఎస్ ప్రతినిధులు ఆమెకు గుర్తుచేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల ఇంటి కలను సాకారం చేయడంలో చేదోడు వాదోడుగా నిలుస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు.