
మొదటి రోజు ఎకరం లోపున్న వారికి పంపిణీ
రైతుల బ్యాంకు అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్
హైదరాబాద్, డిసెంబర్ 12
రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం షురూ అయింది. ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు పంపిణీ ప్రారంభించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. గత వానాకాలం సీజన్లో ఎలాగైతే జమ చేశారో యాసంగిలోనూ అదే పద్ధతిలో నగదు రైతులకు అందజేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం లోపు భూమి ఉన్న రైతులు దాదాపు 22 లక్షల మంది ఉండగా వారి బ్యాంక్ ఖాతాల్లో దాదాపు రూ. 640 కోట్ల మేరకు డబ్బులు జమ చేసినట్టు అగ్రికల్చర్ వర్గాలు తెలిపాయి. అయితే నూతన ప్రభుత్వం రైతుబంధుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా సర్క్యూలర్ విడుదల చేయలేదు. ఒకటి రెండు రోజుల్లో సర్క్యూలర్ వస్తుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. సర్క్యూలర్ వచ్చిన తరువాత కొత్త వారికి సంబంధించిన విధివిధానాలతో రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. తాజా నిధులు నగదు బదిలీ రూపంలో రైతులకు చేరుతున్నాయి. నిధులు వున్న దాన్ని బట్టి రోజు వారిగా ఎకరాల వారిగా నగదు రైతులకు అందనుంది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిధులు అడ్జెస్ట్ ను బట్టి పంపిణీ జరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎకరానికి ఐదు వేల చొప్పున కొనసాగిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు సీజన్ లకు కలిపి ఎకరానికి రూ.15వేలు అమలు చేయాలని సర్కారు యోచిస్తోంది
