
దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని ఆపాలి
- ఉత్తర భారతీయుల వలసలకు అడ్డుకట్ట వేయాలి
- అన్ని కంపెనీల్లో దక్షిణ భారతీయులకు మాత్రమే అవకాశాలు కల్పించాలి
- సినిమాల్లో దక్షిణాది నటీనటులకే అవకాశాలు కల్పించాలి
- సివిల్ సర్వీసెస్ అధికారుల్లో దక్షిణ భారతీయులే కీలక స్థానాల్లో ఉండాలి
- దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన మన వాటా నిధులు మనకే రావాలి
- దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ‘సౌత్ సేన’ లేఖ
హైదరాబాద్, జనవరి 05
దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు సౌత్ సేన అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి రమేష్, సభ్యులు జగదీష్ శుక్రవారం లేఖలు రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారికి, పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారికి లేఖలు రాశారు.
ఆయా ముఖ్యమంత్రులకు రాసిన ఆ లేఖల సారాంశం…
దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. అన్ని రంగాల్లో వారు పాతుకుపోతున్నారు. దక్షిణ భారత్‌లో నలుమూలలా విస్తరించిపోయారు. ఉత్తరాది వలసల కారణంగా దక్షిణాది ప్రజలు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ఇక్కడ వ్యాపారులుగా స్థిరపడిపోయి దక్షిణాది వ్యాపారస్థులను దెబ్బతీస్తున్నారు. జనరల్ స్టోర్స్, హోటల్స్, జ్యువెల్లరీ, గ్రానైట్, మార్బుల్, శానిటరీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ యాక్సెసరీస్ వంటి వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, త్రివేండ్రం వంటి పెద్ద పెద్ద నగరాల్లో వ్యాపారాలన్నింటినీ వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. నార్త్ ఇండియన్ ఫుడ్‌ను ముందుకు తెచ్చి, దక్షిణాది వంటకాలను కనుమరుగు చేస్తున్నారు. కొన్నిచోట్ల 25 శాతం వ్యాపారం ఉత్తరాది రాష్ట్రాల వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. రోడ్ల పక్కన టీ షాపులు, టిఫిన్ సెంటర్ల వంటి చిన్న వ్యాపారాల్లోనూ ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోయింది.
మూతపడుతున్న దక్షిణాది వ్యాపారాలు…
ఉత్తరాది రాష్ట్రాల వాళ్లే ప్రతి జిల్లాలోనూ వ్యాపారాలను నెలకొల్పారు. వీరి పోటీని తట్టుకోలేక స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలను మూసేసుకుంటున్నారు. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వృత్తిపరంగా వ్యాపారులైన వైశ్యులు ఉత్తరాది ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. వారి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు ఇక్కడ వ్యాపారాలు నెలకొల్పుతున్న ఉత్తర భారతీయులు స్థానిక కార్మికులను పనిలోకి తీసుకోవడం లేదు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకే పని కల్పిస్తున్నారు. దీంతో మన రాష్ట్ర వాసులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. చికెన్ షాపులు, బట్టల దుకాణాలు, హమాలీ పని, ఆఖరికి పొలాల్లో నాట్లు వేసే పనులకు కూడా ఉత్తర భారతీయులు వస్తున్నారు. దక్షిణాదిలో ఉత్తర భారతీయుల జనాభా దాదాపు మూడు కోట్ల వరకు ఉంటుందని అంచనా. అనేక కంపెనీల్లో సగానికి పైగా ఉద్యోగులు, లేబర్లు ఇతర రాష్ట్రాల వాళ్లే ఉన్నారు. ఈ రకంగా దక్షిణ రాష్ట్రాలకు ఉత్తర భారతం నుంచి తీవ్రమైన ముప్పు నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ఉత్తర భారతీయుల ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు సౌత్ సేన ఏర్పడింది. దీనికి దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజల సహకారం కోరుతున్నాము.
సౌత్ సేన విన్నపం…
– దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల వలసలకు అడ్డుకట్ట వేయాలి.
– అన్ని కంపెనీల్లో దక్షిణ భారతీయులకు మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
– దక్షిణ భారతీయుల వ్యాపారాలకు రక్షణ కల్పించాలి. ఉత్తర భారతీయుల ఆధిపత్యానికి చెక్ పెట్టండి.
– సినిమాల్లో దక్షిణ భారతీయులకే అవకాశాలు కల్పించాలి. నటీనటులు, చిత్ర రంగంలో పనిచేసే కార్మికుల్లో దక్షిణ భారతీయులనే తీసుకోవాలి.
– దక్షిణాది సినిమాలకే థియేటర్లు కేటాయించాలి. హిందీ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు.
– ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ అధికారుల్లో దక్షిణ భారతీయులే కీలక స్థానాల్లో ఉండాలి. ఉత్తరాది అధికారుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి.
– విద్యార్థులపై హిందీ సబ్జెక్ట్‌ను రుద్దకూడదు. దాన్ని కేవలం ఆప్షన్‌గా మాత్రమే ఉంచాలి.
– రాజకీయ రంగంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది. దక్షిణాదికి చెందిన నాయకులకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఉండటంలేదు. ఇది మారాలి.
- 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో దక్షిణ భారతదేశానికి రాజకీయ, ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. దక్షిణాది ప్రాతినిధ్యం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇలా జరగకుండా చూడాలి.
– కేంద్రానికి అధిక పన్నులు చెల్లిస్తుంటే, దక్షిణాదికి మాత్రం ఆ స్థాయిలో నిధులు వెనక్కు రావడంలేదు. మనకు రావాల్సిన వాటా సొమ్మును కూడా ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లిస్తున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాలను అమలు చేయలేని దుస్థితిలోకి దక్షిణాది రాష్ట్రాలు వెళుతున్నాయి. అందువల్ల మన వాటా మనకు రావాలి.