
రైతు వేదికల్లో ఏర్పాట్లు
నేరుగా సలహాలు ఇవ్వనున్న అధికారులు
రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లోని రైతు వేదికలను ఆధునీకరించడానికి వ్యవసాయశాఖ సిద్ధమైంది. దీనిలో భాగంగా మెదటి దఫాగా ప్రతీ జిల్లాకు ఏడీఈ స్థాయి అధికారుల పరిధిలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విడతల వారిగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో ఈ సేవలను విస్తరించనున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ టెస్టింగ్ పూర్తి చేశారు. త్వరలో మరిన్ని రైతు వేదికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. వ్యవసాయశాఖతో పాటు వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు ఈ రైతు వేదికల ద్వారా రైతులకు సేవలను అందించనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందే సేవలు ఇవే..
మెదటి దశలో ప్రతీ ఏడీఈ డివిజన్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులు, శాస్త్రవేత్తలు వివిధ దశల్లో రైతులతో నేరుగా మాట్లాడి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. రైతులు పంటలకు సంబంధించిన సమస్యల లక్షణాలు, చీడ పీడలను శాస్త్రవేత్తలకు వివరించే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశమై ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త స్కీములపై అవగాహన కల్పించనున్నారు. వివిధ శాఖల మంత్రులు నేరుగా రైతులతో మాట్లాడే వీలు కల్పించనున్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా వినిపించే అవకాశం కల్పిస్తారు. బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాలు, వివిధ స్కీములు వివరించే అవకాశం కల్పిస్తారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్థకశాఖ వెటర్నరీ డాక్టర్లు రైతులకు సలహాలు అందించనున్నారు. రైతులతో నేరుగా సమావేశమై ముఖాముఖిగా ప్రతీ సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించుకునే వీలు కల్పిస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపాయి.

