
అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ సభలో మంత్రి తుమ్మల
అగ్రి డాక్టర్స్ డైరీ ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్, జనవరి 17
రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత కల్పించి బలోపేతం చేసుకుని ముందుకు సాగుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్‌శాఖ ఉద్యోగులు ఉత్సాహంతో పని చేసి వ్యవసాయరంగం పురోగాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ భవన్‌లో అగ్రి డైరీ- 2024, ఆవిష్కరణ సభకు తుమ్మల ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకున్నారు..దాని ఫలితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైందనీ ఉద్యోగులు సరి కొత్త ఉత్సాహంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనుకున్న రీతిలో రాష్ట్రం ముందుకు వెళ్లలేక పోయిందనే భావన అన్ని శాఖల్లో ఉందన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగులతో పాటు ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను సంతృప్తి పరచడానికి మనకున్న సదావకాశమని అన్నారు. స్వయంగా రైతునైనా తాను వ్యవసాయశాఖకు మంత్రిగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గతంలో నాలుగు ప్రభుత్వాల్లో పనిచేశానని, కానీ ఇంత చిద్రమైన పరిస్థితి తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఉద్యోగుల సమిష్టి కష్టం, స్ఫూర్తితో పూర్వ వైభవం తీసుకు వస్తారని ఆశిస్తున్నానని మంత్రి తుమ్మల అన్నారు.

ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటేనే వ్యవసాయరంగాన్ని విజయవంతం చేయగలుగుతారు. రాష్ట్ర రైతాంగం సంతృప్తిగా ఉంటేనే ప్రజలు, ప్రభుత్వం అంతా సంతోషంగా ఉండగలుగుతారని మంత్రి అన్నారు. అగ్రికల్చర్ ఉద్యోగులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, ఇప్పటికే వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. ఉద్యోగులు తమ కష్టాన్ని సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు అవకాశం ఉందనీ, సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేవారు. 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఏర్పాటు జరగలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అతి త్వరలో అగ్రికల్చర్ ఉద్యోగసంఘాల అభిప్రాయాలను తెలుసుకుని వాటన్నింటినీ క్రోడీకరించుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు: ఆగ్రోస్ ఎండీ కె రాములు
యువ అగ్రికల్చర్ అధికారులు నిరంతరం సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారనీ
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, అగ్రిల్చర్ జాయింట్ డైరెక్టర్, ఆగ్రోస్ ఎండీ కె రాములు అన్నారు. వ్యవసాయశాఖ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకువచ్చే సంస్కరణలను, సాంకేతిక పరమైన సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయశాఖలో సంఘం ప్రతినిధులు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను మంత్రికి విన్నవించారు. అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీరాజరత్నం, కార్యదర్శి తిరుపతి నాయక్, కోశాధికారి మధుమోహన్, సల్మాన్, మహిత, నిషాంత్, రాంచందర్, రిటైర్డ్ అధికారులు చంద్రప్రకాష్, తదితర ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

