
హైదరాబాద్, ఫిబ్రవరి 19
ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ రాజ్య స్థాపనకు ఎనలేని కృషి చేశారని వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ అన్నారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా సోమవారం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ శివాజీ హిందువులు తలెత్తుకుని తిరిగేలా పాలన కొనసాగించారని తెలిపారు. 400 ఏళ్ల క్రితమే ప్రజల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని కొనియాడారు. మొగల్ చక్రవర్తులను గడగడలాడించారని, ఔరంగజేబుకు హడలెత్తించిన ఘనత శివాజీకే దక్కిందన్నారు.

మరఠ్వాడాలోని ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో తనదైన ముద్ర వేశారని కీర్తించారు. తన రాజ్యంలోని ప్రజలను నేరుగా పిలిపించి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునే వారన్నారు. భూస్వామ్య వ్యవస్థను తొలగించి నూతన రెవెన్యూ వ్యవస్థను నెలకొల్పారన్నారు. రైతులు పండించిన పంట దిగుబడి ఆధారంగా ఆ పంట యొక్క విస్తీర్ణాన్ని కొలిచి, ఆ తర్వాత మాత్రమే పన్నులు వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారని పెరిక సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, హిందులయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు..
