ఏపీలో జరగనున్న ఎన్నికల సందర్భంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు తెగ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పిఠాపురం నియోజకవర్గం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో వున్నారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఆయన ఫ్యామిలీ నుంచి నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు పిఠాపురంలో ప్రచారం చేశారు. ఈ నెల 9న తమ్ముడికోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.
ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జనసేన నిర్ణయించుకుంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటంతో ఆ స్థానంపైనే అందరి దృష్టి నెలకొంది. సొంతంగా ఇంటిని సైతం ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు పవన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లు ప్రచారం చేశారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడిబాటలో నడుస్తూ ఆ పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో పవన్ వెంటే వుంటూ తోడు నిలిచారు.
పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఈ నెల 9వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నారని సమాచారం.విదేశాల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు చిరంజీవి. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల ఖర్చుకోసం మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరు ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రిగా రెండేళ్లు పనిచేసారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ కనిపించలేదు. జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్నా, ఆ పార్టీ తరపున ఎక్కడా ప్రచారం చేయలేదు. పలు మీడియా సమేవేశాల్లో, ఆడియో వేడుకల్లో తమ్ముడికి నా సపోర్టు ఎప్పుడు ఉంటుందనీ బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు తమ్ముడికోసం ఏకంగా పిఠాపురం రానున్న నేపథ్యంలో జనసేన గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
2019 ఏపీ శాసన సభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. గాజువాక, విశాఖపట్నం రెండు స్థానాల్లో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు పవన్. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి పోటీగా కాపు సామాజిక వర్గానికి చెందిన వంగాగీత వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. స్థానికంగా బలమైన నేత అవటంతో పాటు, కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా వంగాగీత వైపు ఉండటంతో వైసీపీ కూడా విజయంపై ధీమాగా కనిపిస్తోంది. పిఠాపురంలో జనసేన, వైసీపీల మధ్య భీకరమైన పోటీ ఉన్నందున పవన్ కోసం తమ వంతు బాధ్యతగా మెగాఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా బయటికి వస్తూ ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈసారైనా విజయం వరిస్తుందో లేదో చూడాలి మరీ.