దేశ రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల రంగ ప్రవేశం రోకురోజుకి పెరుగుతూ వస్తూనే వస్తుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలు సినీ ప్రముఖులు లోక్ సభ ఎన్నికల సమరంలో తలపడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ నుంచి అధికంగా సినీ ప్రముఖులు పోటీ చేస్తున్నారు. సినిమాల్లో ఆదరించినట్లే రాజకీయాల్లో కూడా వారిని ఆదరిస్తారా..?
లోక్ సభ ఎన్నికల్లో బాలీవుడ్ నుంచి హేమా మాలిని, కంగనా రనౌత్, భోజపురి నటుడు రవి కిషన్, శత్రుజ్ఞ సిన్హా లాంటి అగ్రతారలు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ బాలీవుడ్ నటి హేమా మాలిని మరోసారి లోక్ సభ ఎనికల్లో ఉత్తర ప్రదేశ్ లోని మధుర నుంచి పోటీ చేస్తున్నారు. 2004 లో బీజేపీలో చేరిన ఆమె, 2011 లో బీజేపి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి హేమా మాలిని మధుర స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
బాలీవుడ్ లో నిరంతరం వార్తల్లో వుంటూ, నటనలో తనకంటూ ఓ మార్కుని సెట్ చేసుకున్న నటి కంగనా రనౌత్. సినిమాల్లో ఆమె నటనకు గాను 3 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. మొదటి నుంచి కూడా కంగనా రాజకీయాల్లో ప్రధానమంత్రి మోదీని సపోర్టు చేస్తూ వస్తోంది. హిందూ దేవుళ్ళకు సంబంధించిన వార్తల్లో నిత్యం సోషల్ మీడియాలో ఆమె పోస్టులు హల్చల్ అవుతూనే ఉంటాయి.
2024 మార్చిలో కంగనాని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానంలో బీజేపీ నుంచి కంగనా ఈసారి ఎన్నికల భరిలో నిలుస్తున్నారు. రేసుగుర్రం, సుప్రీమ్ లాంటి తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన భోజ్ పురి నటుడు రవి కిషన్ అందరికి సుపరిచితమే. 2019లో ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. మరోసారి రవి కిషన్ కి గోరక్ పూర్ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం కల్పించింది.
దక్షిణాది రాష్ట్రాలయిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. బీజేపీకి మొదటి నుంచి కూడా ఉత్తరాది రాష్టాలలో మాత్రమే పట్టు ఉంది. దక్షిణాదిలో ఎలాగైనా పట్టు సాధించాలనే ధ్యేయంతో పని చేస్తోంది. సౌత్ రాష్ట్రాలలో పాగా వేసేందుకు, బీజేపీ నుండి కొన్ని స్థానాల్లో సినీ ప్రముఖులను ఎన్నికల బరిలో నిలపుతోంది.
వారిలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తమిళనాడులోని విరుదునగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. నటి రాధికా అన్నాడీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత ఆ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా అఖిల భారత సమతువ మక్కల్ పార్టీని పెట్టారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేసారు. ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదే విధంగా మలయాళం సీనియర్ నటుడు సురేష్ గోపి కేరళలోని తిసూరు నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో 2019, 2021 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ సురేష్ గోపి పోటీ చేసి ఓటమి చెందారు.
ఏపీలో అధికారం కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరాయి. పొత్తులో భాగంగా కూటమి నుంచి సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసారు పవన్ కళ్యాణ్. 2009 ఎన్నికల్లో ఓడిపోవటంతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్టు చేయడం వల్లే టిడిపి అధికారంలోకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీచేసి గెలచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
నందమూరి తారకరామారావు తనయుడు అయిన బాలకృష్ణ టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. తన తండ్రి అక్కడి నుండే ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరవాత నందమూరి హరికృష్ణ సైతం అక్కడి నుండి పోటీచేసి గెలిచారు. నందమూరి బాలకృష్ణ 2014 నుంచి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014, 2019 హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఏపీలో మరో సీనియర్ నటి ఆర్కే రోజా వైసీపీ తరపున రెండు సార్లు నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. టాలీవుడ్ నుంచి కమెడియన్ ఆలీ, సీనియర్ నటుడు మురళీమోహన్, నటి జయసుధ, జీవిత రాజశేఖర్ లాంటి చాలా ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
శ్రీను వాసంతి లక్ష్మీ సినిమా ద్వారా 2004లో అరంగేట్రం చేసిన నవినీత్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు అందరికి పరిచయం అక్కర్లేని పేరు. రవి రానని వివాహం చేసుకున్న నవినీత్ కౌర్ 2014 లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచి, మార్చి 2024 బీజేపీలో చేరారు. మహారాష్ట్రలో అమరావతి లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పలు సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ ఆటగాళ్లు కూడా రాజకీయాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపుతున్నారు. రాజకీయాలు కొందరికి కలిసొచ్చినప్పటికి, మరి కొందరికి అంతగా కలిసి రాలేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ ప్రముఖులు రాజకీయాల్లో గెలిచి ఏ మేరకు రాణిస్తారో చూడాలి మరీ..