తెలంగాణ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో సినీ ప్రముఖులకు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు మొండిచేయి చూపించాయి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. పార్టీ మారిన వారికే టికెట్లు కేటాయించడంతో సినీ నేతలకు పోటీ చేసేందుకు అవకాశాలు లేకుండా పోయాయి. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుని మొదటి నుంచి పార్టీలను ప్రజలలోకి తీలుకెళ్లిన సినీ నేతలు అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనపరచినప్పటికి అవకాశం దక్కలేదు.టికెట్ ఆశించి భంగపడ్డ సినీ ప్రముఖుల లిస్టు టాలీవుడ్ లో చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించాక ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సినీ ప్రముఖులు విజయశాంతి, దిల్ రాజు, బండ్ల గణేష్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రధానంగా ఉన్నారని వినిపిస్తోంది. బీజేపీ నుంచి కాంగ్రెసులో చేరిన విజయశాంతి మెదక్ ఎంపీ స్థానం ఆశించారు. ప్రస్తుతం జరగనున్న లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి కమెడియన్ మరియు ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను తనదైన శైలిలో విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానంలోకి రావటానికి బండ్ల గణేష్ అహర్నిశలు కష్టపడ్డారు. అయినప్పటికీ తనకి కాంగ్రెస్ అవకాశం కల్పించలేదు.
2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని దిల్ రాజును అడగగా నిరాకరించారు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నారని వినపడింది. ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్టానం అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోషా మహల్ కాంగ్రెస్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆస్కార్ సింగర్ రాహుల్ సిప్లి గంజ్ చాలా ప్రయత్నాలు చేసారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నికలకు ముందు కలిసి పలుమార్లు అభ్యర్థించినప్పటికి టికెట్ దక్కలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు హీరో నితిన్ ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో ఆ విషమంపై పలుమార్లు భేటీ అయ్యారు. హీరో నితిన్ ఆశించినట్లు బీజేపీ అవకాశం కల్పించలేదు. సీనియర్ నటి జయసుధ గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. ఆ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ ఆశించారని తెలుస్తోంది. అయినప్పటికీ నటి జయసుధకి అవకాశం వరించలేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కేసీఆర్ పక్కన పెట్టారు. దాంతో పార్టీ మారి చేవెళ్ళ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించినప్పటికి అవకాశం దక్కలేదు. ఇలా సినీ నేతలందరికి జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెసులు నిరాశని మిగిల్చాయి. టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న వీరందరికీ ఎందుకు టికెట్ ఇవ్వలేదని సినీ ప్రేముఖులు ఆశ్చర్యపోతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ సినీ ప్రముఖులందరికి కాంగ్రెస్, బీజేపీలు ముందుముందు ఎలాంటి అవకాశాలు కల్పిస్తాయో వేచి చూడాలి.