దేశవ్యాప్తంగా 7 విడతలుగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్టాల్లో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటర్లకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మే12 సాయంత్రం వరకు ఎన్నికల అధికారులను పోలింగ్ కేంద్రాలకు పంపనుంది. ఒక రోజు ముందే ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసే భోజన ఏర్పాట్లలో తెలంగాణ, ఏపీకి చాలా తేడా కనిపిస్తోంది..
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా పోలింగ్ జరుగనుంది. మే 12 సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు చేరుకుంటారు. వాళ్లకు భోజన ఏర్పాట్లు చేసేందుకు ఒక్కో గ్రామానికి సిబ్బందిని నియమించారు. మే 12 సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ ,5 గంటలకు నిమ్మరసం , రాత్రి 8 గంటలకు అన్నం,చపాతీ, టమాటా పప్పు, పెరుగు పెట్టనున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు రెండు అరటిపండ్లు ఒక టీ ఇస్తారు. 9 గంటలకు క్యారెట్ టమాటతో కూడిన ఉప్మా పల్లీల చెట్నీ, మద్యాహ్నం 12 గంటలకు మజ్జిగ అందిస్తారు. ఒంటిగంటకు కోడిగుడ్డు కూర, సాంబారు, పెరుగుతో కూడిన భోజనం అందిస్తారు. సాయంత్రం 5.30 సమయంలో టీ , బిస్కెట్లు, స్నాక్స్ ఇస్తారు. ఎన్నికల అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫ్యాన్లు, కూలర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీ అంటేనే మర్యాదలకు పుట్టినిల్లు. ఇంటికీ వచ్చిన అతిథిని భోజనాలతో భయపెట్టేస్తారు. మే 13 న జరగనున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారులకు వారి సంప్రదాయాలకు అనుగుణంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12 సాయంత్రం అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోగానే బొండాలు,గారెలు,అల్పాహారం, మజ్జిగ ఇస్తారు. రాత్రి 8 గంటలకు అన్నం, చపాతీ, ఆలు టొమాటో కూర , ఆకుకూర పప్పు, చట్నీ, పెరుగు, వడియాలు, అరటిపండుతో కూడిన భోజనం అందిస్తారు. మే13 పోలింగ్ రోజున ఉదయం లేవగానే 5 గంటలకు టీ ఇచ్చాక, 8 గంటలకు వేడి వేడి ఇడ్లీ, గారే,రెండు రకాల పచ్చళ్ళతో టిఫిన్ పెడతారు. 10 గంటల సమయంలో మజ్జిగ లేదా కొబ్బరి బొండం ఇస్తారు. 11 గంటలకు మజ్జిగ ఇచ్చాక మధ్యాహ్నం భోజనంలో వెజిటబుల్ బిర్యానీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి పెడతారు. 3 గంటలకు ఉస్మానియా బిస్కెట్లు, టీ, ఫ్రూట్ సలాడ్ ఇస్తారు. సాయంత్రం 6 గంటలకు బొండాలు, గారెలు, చట్నీ పెడతారు. ఇవన్నీ అక్కడే ఉన్నవారితో వేడివేడిగా తయారుచేయించి ఎన్నికల అధికారులకు వడ్డించనున్నారు. ఒక్కో కేంద్రానికి 15 మందితో కూడిన సిబ్బందిని ఏర్పాటు చేశారు. సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక అధికారులకు అప్పజెప్పారు.
ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో రెండుసార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. మొదటగా పార్లమెంటు స్థానానికి ఓటు వేశాక, అసెంబ్లీ స్థానానికి వేయాల్సి ఉంటుంది. పోలింగ్ బూతులోకి ఓటు వేసేవారు ఫోన్లు తీసుకురాకూడదు. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి ఆటంకాలు జరగకుండా పటిష్టమైన కేంద్ర పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు.
