
ఇప్పటికే నీళ్లు కొంటున్నాం..
చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గాలిని కొనాల్సి వస్తది
హార్టీకల్చర్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
నర్సరీమేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 29
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు పెంచడం అనివార్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటి వరకు నీళ్లు మాత్రమే కొంటున్నామనీ, ప్రకృతిని చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గాలిని కూడా కొనాల్సి వస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో 16వ గ్రాండ్ నర్సరీమేళా పేరుతో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా హార్టీకల్చర్ షోను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని పట్టనాలు ఆక్సీజన్ కొనుక్కొనే పరిస్థితి ఉంది. ఢిల్లీలో ఆక్సీజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి, మంచినీళ్లు కొనుక్కొవడమే కాకుండా ఆకరికి గాలి కూడా కొనుక్కొనే పరిస్థితి ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూఫ్ గార్డెన్, వర్టికల్ గార్డెన్స్, ఇలా ఇంటినిండా మొక్కలు పెంచుకోవాలనే ప్రజల ఆకాంక్షను చూస్తున్నామన్నారు. హార్టీకల్చర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున రూఫ్ గార్డెన్స్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వ్యవసాయశాఖ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజలు రూఫ్ గార్డెన్స్, ఇంట్లో, ఇంటిపక్కన ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూరగాయలతో పాటు పచ్చదనంగా ఉండేలా మొక్కలు పెంచాలన్నారు. మొక్కలు ఇచ్చే ఆక్సీజన్ ద్వారా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మనం చెట్లకు ప్రాధాన్యత ఇచ్చి వృక్ష సంపదను పెంచుకుంటే తప్ప సమసమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయన్నారు. ఈనేపథ్యంలో అందరం మొక్కలు పెంచుకోవాలనే అలవాటును అలవర్చుకోవాలన్నారు. ఈ ఉద్దేశ్యంతోనే రాష్ట్రంలో వనమహోత్సవం నిర్వహిస్తున్నమన్నారు. నర్సరీ మేళాలో అందమైన పూలమొక్కలు రూ.50 నుంచి రూ.3లక్షల ఖరీదైన మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొక్కల ప్రియులు వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోని మేళాను విజయవంతం చేయాలన్నారు. హార్టీకల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్నా మొక్కలు పెంచాలన్నారు. ప్రజలంతా తమ ఇష్టదైవం పేరుతో, తమ తల్లిదండ్రలు పేరుతో కనీసం వారి పిల్లల పేరుతో అయినా ప్రతి ఇంటిలో మొక్కలు నాటి విజయంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

హార్టీకల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా మాట్లాడుతూ..ఈ నర్సరీ మేళాలో కిచెన్ గార్డెన్, ఆర్ణమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, చెట్లను పెంచడానికి కావాల్సిన వస్తువలును ప్రమోట్ చేసే విధంగా ఎగ్జిబిట్ చేయడం జరిగిందని వివిధ రాష్ట్రాల నుంచి 150స్టాల్స్ ఎగ్జిబిట్స్ వచ్చాయని వివరించారు. 2015 నుంచి హైదరాబాద్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కలున్న అందరికీ అందుబాటులోకి ఉండే విధంగా వివిధ రకాల మొక్కలను అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
