ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్

హైదరాబాద్ సెప్టెంబర్ 17

తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైంది…తెలంగాణ అంటే త్యాగం… ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు.ఆ నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా.తెలంగాణ ప్రజలకు ‘‘ప్రజా పాలన దినోత్సవ’’ శుభాకాంక్షలు…సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు.  ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి…కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు…ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం..స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించింది..అందుకే… ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ… ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా నామకరణం చేశాం..ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష… వారి ఆలోచన…ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి…మనం జాగ్రత్తగా గమనిస్తే… తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది.

పిడికిలి పోరాటానికి సింబల్‌…తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా  ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది.ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం. బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు.ఐక్యంగా, సమైక్యంగా  ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉంది.ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి.

పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి.గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది.ఆ బానిస సంకెళ్లను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్‌ 17…నేను పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాను.తెలంగాణను నియంత పాలన నుండి విముక్తి చేస్తానని చెప్పాను…గజ్వేల్‌ గడ్డ మీద 2021 సెప్టెంబర్‌ 17 నాడు ‘‘దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా’’ మోగించినం…2023 డిసెంబర్‌ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే.

మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే.అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి..బాధ్యతగా ఉండాలి… ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి.అమరుల ఆశయాలు ఉండాలి… యువత ఆకాంక్షలు ఉండాలి…మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.

పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం.తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి, తెలంగాణ అస్థిత్వం అంటే మా కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారు.తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని భ్రమించారు…మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్ధేశం వారికి లేదు.నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం విస్మరించారు…మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా…అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాను.

అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం…తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం…తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం TS ను TG గా మార్చాం…ఇది కేవలం అక్షరాల మార్పు కాదు… ప్రజల ఆకాంక్షల తీర్పు.రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇటీవలే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేసుకున్నాం.

డిసెంబర్‌ 9 నాడు మన తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం…తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్‌ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం..కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం…ఇలా… ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగుతున్నాం…గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు.

7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం…ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాల్‌గా స్వీకరించాం…అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.

ఆదాయ లీకేజీలు అరికట్టాం…కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం.ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలు సార్లు ఢిల్లీ వెళ్లా….ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి, వినతి పత్రాలు ఇస్తున్నాం…నా ఢిల్లీ పర్యటనల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు…కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫాంహౌస్‌ ముఖ్యమంత్రిని కాదు… పని చేసే ముఖ్యమంత్రిని.  ..నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్లడం లేదు…ఢిల్లీ  ఏ పాకిస్తాన్‌ లోనో, బంగ్లాదేశ్‌ లోనో లేదు… అది మన దేశ రాజధాని.

ఇది ఫెడరల్‌ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి…రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం…అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు…ఆ హక్కుల సాధన కోసం ఎన్ని సార్ల్లైనా ఢిల్లీకి వెళతా…ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా గట్టిగా మన వాదనలు వినిపించాం…కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశాం…మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’ గా బ్రాండ్‌ చేస్తున్నాం…పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం…ఇటీవల బేగరి కంచె వద్ద ఫోర్త్‌ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం…మూసీ సుందరీకరణ హైదరాబాద్‌ రూపు రేఖలను మార్చి వేస్తుందనడంలో సందేహం లేదు…ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు…..వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్‌ హబ్‌గా తీర్చి దిద్దబోతున్నాం…తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది.

ఒకవైపు గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం.

మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం.

టీ – న్యాబ్‌ ను బలోపేతం చేశాం.

మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం.

పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం.

ఇటీవలే ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించుకున్నాం.

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాలకు పదును పెడుతున్నాం… ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం.

యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతోంది.

క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేం నమ్ముతున్నాం.       

తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌గా మాత్రమే కాదు… క్లీన్‌ స్టేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది.

నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు….

పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది.

అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.

ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళ పాలకుల పాపమే.

వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం.

చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాం.

వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి.

ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు.

హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు… స్వార్థం లేదు.

అదొక పవిత్ర కార్యం…. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం….దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి.

కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు.

హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది.

ఇది నా భరోసా…. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా.

ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్‌కు ట్రాక్‌ రికార్డు ఉంది.

సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగ రాస్తున్నాం.

మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే…

గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు.

మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో  ఏక కాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాం.

ఆరు నెలల వ్యవధిలో 18 వేల కోట్ల రూపాయలు, 22 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా!?

ఇదీ రైతుల విషయంలో మా కమిట్‌మెంట్‌.

మన ఆడబిడ్డలు 87 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధిని పొందారు.                 

దీనివల్ల వాళ్లకు 2,958 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

అధికారంలోకి వచ్చిన  48 గంటల్లో ఈ పథకం మొదలు పెట్టాం.

ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచాం.  

ఆడబిడ్డలకు 500 రూపాయలకే వంట గ్యాస్‌ ఇచ్చి 43 లక్షల కుటుంబాలకు మేలు చేశాం.

దీని కోసం ఇప్పటి వరకు 282 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం చెల్లించాం.

200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.

ఈ పథకంలో 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.

దీని కోసం ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం.

ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం.

స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం.

నేతన్నల కోసం ఇటీవల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం.

దీనికి తెలంగాణ ఉద్యమ దిక్సూచి స్వర్గీయ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టుకున్నాం.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్‌ను ఇటీవలే ఏర్పాటు చేశాం.

యువతకు శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటికి పునాదిరాయి వేశాం.

నిరుద్యోగుల భవిష్యత్‌కు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైంది.

మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి యువతకు భవిష్యత్‌ పై ఆశలు చిగురింపజేశాం.

గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం.

11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించాం.

అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం.

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళాశక్తి పథకం ప్రారంభించాం.

వచ్చే ఐదేళ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని సంకల్పించాం.

మా మానిఫెస్టోలో చెప్పినట్లుగా మరణించిన గల్ఫ్‌ కార్మికుల కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం.

గల్ఫ్‌ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను  అందివ్వబోతున్నాం.

గల్ఫ్‌ కార్మికులు, ఇతర దేశాల్లో పనిచేస్తున్న మనవారి సమస్యలు వినడానికి… సత్వర పరిష్కారానికి ప్రజాభవన్‌లో ‘‘ప్రవాసీ ప్రజావాణి కేంద్రం’’ ఏర్పాటు చేస్తున్నాం.

వీటితో పాటు గల్ఫ్‌ కార్మికుల సమస్యల అధ్యయనానికి, వాటి పరిష్కారాల కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తాం.       

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ.

పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి.

నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది.

సెప్టెంబర్‌ 17 ఇకపై  ప్రజా పాలన దినోత్సవం.

తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు.

వారి ఆలోచనలే మా ఆచరణ.

వారి ఆకాంక్షలే… మా కార్యాచరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text