
నేడు హనుమకొండలో ప్రారంభం
వెల్లడించిన స్టేట్ ప్రెసిడెంట్ సురేష్
హైదరాబాద్, జనవరి 09
34వ సీనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్ 2024=-25 శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు సెపక్ తక్రా అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ జాతీయస్థాయి పోటీలు జనవరి 10 నుండి 14 వరకు హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలలో జరుగుతాయని తెలిపారు. గురువారం హైదరాబాద్లో సురేష్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల నుంచి మహిళలు, పురుషుల జట్లు- పోటీ పడబోతున్నాయని అన్నారు. దేశంలో సెపక్‌తక్రాకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.

“తెలంగాణతో పాటు భారతదేశం అంతటా సెపక్‌తక్రావాను ప్రోత్సహించడంలో ఈ టోర్నమెంట్ ఒక మైలురాయి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమ్ ఈవెంట్, రేగు ఈవెంట్, డబుల్ ఈవెంట్ , క్వాడ్ ఈవెంట్ నాలుగు విభాగాలలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేకమైన క్రీడలో అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక వేదికను అందించడం ఈ ఛాంపియన్‌షిప్ లక్ష్యమని సురేష్ కుమార్ పేర్కొన్నారు.

ఛాంపియన్‌షిప్ నిర్వహణలో తెలంగాణ సెపక్‌తక్రా అసోసియేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సురేష్ ప్రశంసించారు. సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమనీ, ఇది మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సురేష్ అన్నారు.

హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలలో జరిగే ఈ క్రీడ ప్రారంభోత్సవానికి సెపక్టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో యోగేందర్ సింగ్ దహియ, డాక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, సెక్రటరీ వీర్‌గౌడ, తెలంగాణ అధ్యక్షుడు సురేష్ కుమార్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి వికేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరిడే శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రిక్కల వెంకట రామకృష్ణ, కొత్తూరు కపిల్ ఆనంద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.