
మహాకుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించడం పూర్వజన్మ సుకృతం
నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సురేష్
హైదరాబాద్, జనవరి 27
మహాకుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించడం పూర్వజన్మ సుకృతమని నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేష్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈమహాకుంభ మేళా తొలిపుణ్య స్నానం ఆచరించడంతో పాటు భాగవత్ పారాయణం వంటి సేవా కార్యక్రమాల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఈసందర్భంగా అనంతశ్రీ విభూషిత్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ ఆశీర్వాదం అందుకున్నామని తెలిపారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 45 కోట్ల మంది ప్రజలు హాజరవుతున్నారని తెలిపారు.

ఈ మేరకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయగా ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. దీనిని భారత దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆధునికతకు, స్వచ్ఛతకు, భద్రతకు అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘‘ఇది కేవలం ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక’’ అని సురేష్ ఉద్ఘాటించారు. మహా కుంభమేళా జరిగే చోట భారీ ఎత్తున హిందూ ధర్మాన్ని కళ్లకు కట్టినట్టు కుడ్య, తైలవర్ణ చిత్రాలను రూపొందించారని తెలిపారు.

పూర్ణ కుంభ, శంఖు ఆకృతులు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడికక్కడ సమూహ నిర్వహణ విధానాలను అవలంభిస్తున్నారు. ఇక్కడ అన్నపానాదులు, బసకు ఎలాంటి కొరతా లేదని చెప్పారు. సామరస్యం, కరుణ, అందరూ ఒక్కటేనన్న సందేశాన్ని మహాకుంభ్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నట్టు సురేష్ తెలిపారు.
