
– మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
– ఏఈఓలతో ఫార్మర్ రిజిస్టేషన్
– కేంద్రం ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
– రైతుల వారీగా వివరాలు సేకరణ
– సెంట్రల్ అగ్రికల్చర్ స్కీములకు కీలకం కానున్న ఐడీ
– 11 అంకెలతో యూనిక్ ఫార్మర్ ఐడీ
– ప్రతి రైతుకూ ఓ నంబర్
– ఆధార్, పట్టాదారు పాస్ బుక్, ఫోన్ నంబర్ కు లింక్
– భూమి స్వభావం, పంటల సాగు వివరాలు నమోదు
హైదరాబాద్, మే 03,2025
ప్రతి రైతుకు ఆధార్ తరహాలో యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ(గుర్తింపు) కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల (ఏఈఓ)కు శిక్షణ కల్పించి, మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, వ్యవసాయ శాఖ అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల (ఏఈఓ)ను రంగంలోకి దించి రైతుల వివరాల సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తోంది. ఈ ఫార్మర్ ఐడీ, రైతు సాగు వివరాల డేటాను డిజిటల్ రూపంలో నమోదు చేసి, సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ పథకాలను సులభతరం చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం కాగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
11 అంకెలతో యూనిక్ ఫార్మర్ ఐడీ
ఫార్మర్ ఐడీ అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు, ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. రైతుకు సంబంధించి భూమి, సాగు వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఒకే చోట ఏకీకృతం చేస్తుంది. ఈ 11 అంకెల ఐడీలో రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, భూమి స్వభావం (ఎర్ర నేల, నల్ల నేల, తరి, మెట్ట), సర్వే నంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదవుతుంది. ఈ ఐడీ ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సులభతరం చేయనుంది.

ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జరుగుతుంది ఇలా..
మే 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియను ప్రారంభిస్తారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నంబర్‌తో స్థానిక ఏఈఓను సంప్రదించాలి. రైతులు తమ భూమి వివరాలు, సాగు చేసిన పంటల సమాచారాన్ని అందించాలి. ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. యాప్‌లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్‌లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేయబడింది. ఈ ఐడీ లేకుండా రైతులు ఈ పథకాల ప్రయోజనాలను లభించవు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రైతులు తమ వివరాలతో సిద్ధంగా ఉండి, మే 5 నుంచి ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులు పాల్గొనాలని వ్యవసాయ శాఖ కోరింది.
రైతుల వారీగా వివరాలు సేకరణ
రైతు భరోసా డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 70లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో దాదాపు 32.11లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 1కోటి 90లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 1కోటి 50లక్షల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా 65లక్షల ఎకరాల్లో వరి, 50లక్షల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ సాగు వివరాలను రైతులు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే ఏఈఓలకు శిక్షణ ఇచ్చింది. మే 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. “వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ క్రియేట్ చేస్తాం. కేంద్ర పథకాలకు ఈ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,” అని వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఫార్మర్ ఐడీ వివరాలు ఇవే..
దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులు 10.09కోట్ల మంది ఉండగా, ఇప్పటి వరకు 5.82కోట్ల మంది రైతులకు ఫార్మర్ ఐడీ అందించారు. ఇందులో పీఎం కిసాన్ లబ్ధిదారులు 4.2కోట్ల మంది మాత్రమే ఫార్మర్ ఐడీ కలిగి ఉండడం గమనార్హం. మరో 5.59కోట్ల మంది రైతులకు ఫార్మర్ ఐడీ క్రియేట్ చేయాల్సి ఉంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో 32.11లక్షల మంది లబ్ధిదారుల ఉండగా వారిలో ఆధార్ సీడీంగ్తో పాటు కేవైసీ చేసుకున్న రైతులు 30.52లక్షల మంది ఉన్నారు. మరో 1.58లక్షల మందిక సంబంధించి కైవైసీ చేయాల్సి ఉంది. అదే విధంగా పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో పైలెట్ప్రాజెక్ట్లో 2111 మదికి ఐడీ క్రియేట్ చేయగా మరో 30.50,871 మందికి ఫార్మర్ ఐడీ క్రియేట్ చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది.

ఫార్మర్ ఐడీ ప్రయోజనాలు..
ఫార్మర్ ఐడీ ద్వారా కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయి.
సాగు చరిత్ర డిజిటలైజేషన్ తో ప్రకృతి విపత్తులు, ఇతర సమస్యల సమయంలో ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు వెంటనే తెలుస్తాయి.
పదేపదే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండా, పేపర్‌వర్క్ లేకుండా ఒకే ఐడీతో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి.
-డేటా ఆధారిత విధానాలతో రైతుల వివరాల డిజిటల్ డేటాబేస్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
