
తెలంగాణ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి
పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 2, 2025: తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ఆయన, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, కళాకారుల సమిష్టి కృషిని కొనియాడారు.


ప్రజా ప్రభుత్వ పునర్నిర్మాణ యజ్ఞం
2023 డిసెంబర్ 7న అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత పదేళ్లలో నిర్వీర్యమైన ఆర్థిక, వ్యవస్థాగత సమస్యలను సవాలుగా స్వీకరించి, పునర్నిర్మాణ దిశగా ప్రయత్నిస్తోంది. “ఇది నల్లేరుపై నడక కాదని తెలిసినా, ప్రజల ఆకాంక్షలే మా ఎజెండా,” అని సీఎం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, సమాచార కమిషనర్లు, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ సభ్యుల నియామకంతో వ్యవస్థలను స్వతంత్రంగా, పారదర్శకంగా నడిపేందుకు చర్యలు చేపట్టారు.

మహిళల సాధికారతకు ఇందిరా మహిళా శక్తి
“తెలంగాణ సమాజానికి మహిళలే పునాది,” అని ప్రకటించిన సీఎం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి మిషన్’ను ఆవిష్కరించారు. తొలి ఏడాదిలో రూ.21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాల పంపిణీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ బంకులు, యూనిఫాం కుట్టుపని, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ల ఏర్పాటు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 600 బస్సుల కొనుగోలు, మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనను పటిష్ఠం చేస్తున్నాయి. మహిళలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులు, ఉచిత వైద్య పరీక్షలతో ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు.


రైతు సంక్షేమం: రుణమాఫీ, మద్దతు ధర
రైతు సంక్షేమాన్ని ధ్యేయంగా, ప్రభుత్వం రూ.20,617 కోట్లతో 25.35 లక్షల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. రూ.15,333 కోట్లతో 24 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.12,000, భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో ఏడాదికి రూ.12,000 అందిస్తోంది. సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 8,000కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రతి గింజ కొనుగోలుతో రైతులను దళారుల బారి నుంచి కాపాడుతోంది. ‘భూ భారతి-2025’ చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, హక్కుల రికార్డుల నిర్వహణ జరుగుతోంది.
యువతకు ఉద్యోగ అవకాశాలు
16 నెలల్లో 60,000 ఉద్యోగ ఖాళీల భర్తీ, డీఎస్సీ ద్వారా 10,000 ఉపాధ్యాయ నియామకాలు, అంతర్జాతీయ పెట్టుబడులతో లక్ష మందికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు. సివిల్స్ అభ్యర్థులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుతో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు.

విద్య, వైద్య రంగంలో సంస్కరణలు
విద్యా కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-స్కూల్ విధానం, గురుకులాల్లో మెస్, కాస్మోటిక్ చార్జీలు 40-200% పెంపు, రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టారు. రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి పునరుద్ధరణ, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నారు.
సామాజిక న్యాయం, రిజర్వేషన్లు
బీసీలకు 42% రిజర్వేషన్లు, కులగణన ద్వారా 50.36% బీసీ జనాభా నిర్ధారణ, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టబద్ధత, ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’గా ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు, సన్న బియ్యం పథకంతో 3 కోట్ల మంది లబ్ధిదారులకు ఆత్మగౌరవ జీవనం కల్పిస్తున్నారు.
ఆర్థిక, మౌలిక అభివృద్ధి
రూ.3 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాల విస్తరణతో హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మూసీ పునరుజ్జీవనం, బాపూఘాట్‌ను గాంధీ సరోవర్‌గా, 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీల ఏర్పాటు, రూ.18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్, రూ.24,000 కోట్లతో మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నారు.
శాంతిభద్రతలు, అంతర్జాతీయ గుర్తింపు
ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ పోలీస్ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి దుబాయ్‌లో అంతర్జాతీయ అవార్డు లభించింది. ‘భారత్ సమ్మిట్’, 72వ మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ అంతర్జాతీయ వేదికగా మారింది.
భవిష్యత్ లక్ష్యం: తెలంగాణ రైజింగ్-2047
2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. “తెలంగాణ రైజింగ్ మన మంత్రం,” అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక పరిపాలనతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రజల సహకారం కోరారు.
జై తెలంగాణ! జై హింద్!
