
హైదరాబాద్: జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న పాపకంటి అంజయ్య నేడు అనాథలకు అండగా నిలుస్తూ స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్నారు.
పేదరికం నుంచి ఎదిగి..నేడు పేదలకు వెలుగునిస్తున్న పాపకంటి అంజయ్య
ఒక పేదింటి బాలుడు. ఒకవైపు పొలాల్లో కూలి, మరోవైపు పుస్తకాలు చేతబట్టి బడి. ఆకలికి అలమటించే పరిస్థితుల్లోనూ చదువు మీద పట్టువదలని పట్టుదల. అలా ఓడిపోకుండా పోరాడి, విద్యాబలంతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. కానీ, తన విజయాన్ని తానొక్కడే అనుభవించకుండా, ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల పక్కన నిలబడి వారిని సాయం చేయడం ప్రారంభించాడు. ఇతడే నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన పాపకంటి అంజయ్య.
చిన్ననాటి కష్టాలు – పెద్ద కలల బాట
అంజయ్య, పాపకంటి లింగయ్య–భూషమ్మ దంపతుల కుమారుడు. 7వ తరగతి నుంచే పొలాల్లో కూలిపని చేస్తూ, వ్యవసాయంలో శ్రమిస్తూ చదువుకోవడం మొదలుపెట్టాడు. ఎంత కష్టం వచ్చినా చదువు ఆపకుండా పట్టుదలతో ముందుకెళ్లాడు. ఉన్నత విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో సదరన్ డిస్కం పరిధిలో జనరల్ మేనేజర్గా సేవలు అందిస్తున్నారు.

అనాథలకు అండగా
తన గతాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆర్థికంగా వెనుకబడిన పిల్లల బాధ తట్టుకోలేకపోతున్నారు. వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా అనాథల పరిస్థితిని తెలుసుకుని, స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించి సహాయం అందిస్తున్నారు. ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వారికి గృహనిర్మాణం చేయించి ఇల్లు ఇస్తున్నారు. చదువు ఆగిపోకుండా హాస్టళ్లలో చేర్పిస్తున్నారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా మల్లారెడ్డిగూడెంలో నూతనకంటి రాజేశ్వరి, శివలకు గృహనిర్మాణం చేయించారు.
- భూపాలపల్లి జిల్లా మద్దులపల్లిలో రాజకుమార్, రంజిత, రష్మితలకు ఇల్లు కట్టి, హాస్టల్‌లో చేర్పించారు.
- స్వగ్రామమైన ఇండ్లూరులో రోమన్ కుటుంబం ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో కొత్త ఇల్లు కట్టించి అందించారు.
మానవత్వం – అనాథల కాపాడే చేయి..
విద్యార్థుల కలలకు తోడు
అనాథలకు మాత్రమే కాకుండా పేదింటి విద్యార్థుల ఉన్నత విద్య కోసం కూడా చేయూతనిస్తున్నారు. “హెల్పింగ్ హ్యాండ్” సహకారంతో ఎంతోమంది విద్యార్థులు కాలేజీ, యూనివర్సిటీ చదువులు కొనసాగించేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు.

స్ఫూర్తి నిచ్చే జీవన గాధ
తన చిన్ననాటి కష్టాలను తలుచుకుని, ఇతరుల బాధను తన బాధగా భావించి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్న పాపకంటి అంజయ్య నేడు అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, సమాజంలో వెలుగులేని వారికి దీపంలా మారిన ఆయన జీవన గాధ, నేటి తరం యువతకు మానవత్వ పాఠం చెబుతోంది.
