తెలంగాణ క్యాబినెట్ సమావేశం:

ధాన్యం కొనుగోళ్లు, మెట్రో విస్తరణ, వ్యవసాయ కళాశాలలు సహా కీలక నిర్ణయాలు

హైదరాబాద్, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విద్యా రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించిన మంత్రివర్గం, ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణకు కూడా ఆమోదం తెలిపింది.

వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు చేరనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించిన నేపథ్యంలో, మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాలు, రవాణా శాఖల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించింది. మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించాలని తీర్మానించింది.

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మంత్రివర్గం మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో ఈ కళాశాలలు స్థాపించనున్నారు. అలాగే, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ప్రస్తుత స్థలంలోనే అదనంగా 7 ఎకరాల భూమి కేటాయించాలని, అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు 25 శాతం నుంచి 50 శాతం కోటాను పెంచాలని నిర్ణయించింది.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నిర్వహణ, ఏర్పాట్లపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్నవారు అనర్హులనే నిబంధనను పునరాలోచించిన మంత్రివర్గం, రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్నందున ఈ నిబంధనను ఎత్తివేయాలని సూచనప్రాయంగా అంగీకరించింది.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడల్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై చర్చించింది. ఇందుకు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ రిపోర్టును క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని తీర్మానించింది.

రోడ్ల అభివృద్ధికి హ్యామ్ మోడల్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం, జాతీయ రహదారులు, జిల్లా-మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు ప్రాధాన్యమిస్తుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు వినియోగిస్తున్నందున, వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూమి అప్పగించాలని నిర్ణయించింది.

కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి 845 హెక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మొత్తం వ్యయంలో మూడో వంతు భరించాలని క్యాబినెట్ తీర్మానించింది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డుకు 10 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయాలు రాష్ట్రంలో వ్యవసాయ, రవాణా, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధిని తీసుకువచ్చేలా ఉన్నాయని మంత్రివర్గ సభ్యులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text