
యశ్వంతాపూర్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం విజయవంతం
జనగామ, నవంబర్ 10: జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో యశ్వంతాపూర్‌లో నిర్వహించిన ప్రత్యేక శిబిరం సోమవారం విజయవంతంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ నాముని పావని కుమారి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో జనగామ మండల ఎంపీడీవో వర్తీయ మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు సమాజసేవ ద్వారా జాతీయ భావాలు, శ్రమదాన తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ రుగ్మతలపై స్పందించే గుణం, సామూహిక కృషి, దేశభక్తితో సేవచేసే యూనిఫాం లేని సైనికులుగా వాలంటీర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యశ్వంతాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రోగ్రాం ఆఫీసర్ మరిపెల్ల రవిప్రసాద్ ఆధ్వర్యంలో శిబిరం సందర్భంగా పాఠశాల పరిసరాలను అందంగా తీర్చిదిద్దిన వాలంటీర్లను, శిబిరాన్ని విజయవంతం చేసిన ఆఫీసర్‌ను పాఠశాల అధ్యాపక బృందం సన్మానించింది. వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపింది.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, అనూజ దంపతులు, పడకంటి రవీందర్ డాక్టర్ దంపతులు, కళాశాల స్టాఫ్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, అధ్యాపకులు వస్కుల శ్రీనివాస్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
