
మెస్సీతో మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు – ఆర్ఆర్-9 జెర్సీతో సెంటర్ ఫార్వర్డ్‌గా బరిలో దిగనున్నారు
హైదరాబాద్, డిసెంబర్ 1: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే మైదానంలో సన్నద్ధులవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం గ్రౌండ్‌లో గంటకుపైగా ఆయన ఫుట్‌బాల్ శిక్షణ తీసుకున్నారు. డ్రిబ్లింగ్, పాసింగ్, షూటింగ్ కసరత్తులతో ఉత్సాహంగా కనిపించిన సీఎం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


డిసెంబర్ 13న ఉప్పల్ లోని అథ్లెటిక్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీ నేతృత్వంలోని జట్టుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన సంప్రదాయ 10 నంబరు జెర్సీ ధరించగా, సీఎం రేవంత్ రెడ్డి “RR9” అంకితమైన 9 నంబరు జెర్సీతో సెంటర్ ఫార్వర్డ్‌గా బరిలో దిగనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం స్వయంగా బూట్లు కట్టి మైదానంలో దిగడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు “సూపర్ సీఎం”, “రేవంత్ రెడ్డి గోల్ మెస్సీ గోల్” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెస్సీ హైదరాబాద్ పర్యటనతో నగరం ప్రపంచ క్రీడా పటంలో మరోసారి కీలక స్థానం సంపాదించనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


