
2300 మెగావాట్ల సోలార్, థర్మల్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం
హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)తో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్) నిర్మించనున్న 2,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల (1,500 మెగావాట్ల సోలార్, 800 మెగావాట్ల థర్మల్) నిర్మాణానికి రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.
రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నాగర్ గురువారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులపై ఇరు నేతలు చర్చించారు.
సింగరేణి సంస్థతో కలిసి తమ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగం 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పాదన కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు హీరాలాల్ నాగర్ తెలిపారు. రెండు రాష్ట్రాల విద్యుత్ అవసరాలకు ఈ కొత్త ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని, వీటిని త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో క్యాబినెట్ వెంటనే ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా తొలిసారిగా ఇతర రాష్ట్రమైన రాజస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, ఈ తరహాలో ఇతర రాష్ట్రాలతోనూ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ నుంచి కాలూరాం, ప్రమోద్ శర్మ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ చిరంజీవి, జీఎం (కో ఆర్డినేషన్) టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
