
సింగరేణి రెస్క్యూ జట్లు జాతీయస్థాయిలో ఛాంపియన్… 20 బహుమతులతో ఆల్‌టైం రికార్డ్
హైదరాబాద్, డిసెంబర్ 11: నాగ్‌పూర్‌లో జరిగిన 54వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి కార్మికుల రెస్క్యూ జట్లు అద్భుత విజయం సాధించాయి. పురుషుల జట్టు ఛాంపియన్‌షిప్ సాధించగా, మహిళల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 36 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్లు ఏకంగా 20 బహుమతులు సాధించి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి.

ఈ విజయంపై సింగరేణి సీఎండీ ఎన్. బలరాం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జట్టు సభ్యులను అభినందించారు. “ఈ అద్భుత విజయం సింగరేణి ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటింది. తొలిసారిగా ఏర్పాటైన మహిళా రెస్క్యూ జట్టు రెండో స్థానం సాధించడం మరింత గర్వకారణం. ఇదే స్ఫూర్తితో త్వరలో జాంబియాలో జరగబోతున్న అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లోనూ సింగరేణి జట్లు విజయఢంకా మోగించాలి” అని ఆయన ఆకాంక్షించారు.
పురుషుల జట్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు రెస్క్యూ రిలే, థియరీ, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ అండ్ రికవరీ విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించింది. మహిళల జట్టు ఫస్ట్ ఎయిడ్‌లో మొదటి స్థానంతో పాటు వివిధ విభాగాల్లో బహుమతులు సొంతం చేసుకుంది. ఉత్తమ రెస్క్యూవర్‌గా గాయత్రి చల్లా, ఉత్తమ కెప్టెన్‌గా కృష్ణవేణి అవార్డులు అందుకున్నారు.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం నిర్వహించిన అభినందన సభలో డైరెక్టర్ (పీ అండ్ పీ) కె. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్) టి. శ్రీనివాస్, రెస్క్యూ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి తదితరులు విజేతలను అభినందించి మెడల్స్ బహూకరించారు.
సింగరేణి రెస్క్యూ జట్ల ఈ చారిత్రక విజయం సంస్థలో ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయ స్థాయిలోనూ త్వరలో ఈ జట్లు తమ సత్తా చాటనున్నట్టు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
