ఫ్యూడల్ వ్యవస్థ తిరిగి పురుడుపోసుకుంటుంది
బీజేపీకీ గాంధీ అంటే ఎందుకంత ధ్వేషం
ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి

హైదరాబాద్, జనవరి 03
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి శనివారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. శనివారం మధ్యాహ్నం శాసనమండలిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనీ, పాత చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కొత్త చట్టంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందనీ, గ్రామాల్లో పేదలకు ఉపాధి కరువై వలసలు పెరుగుతాయనీ, పని దినాలు తగ్గుతాయని వెట్టి చాకిరీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంత పేదల ఉపాధి కోసం చట్టం తీసుకురావాలని ఆమె కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్ర సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పథకాలకు ఉత్తరాది పేర్లను పెడుతూ బలవంతంగా రుద్దుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల్లో మైనింగ్ పెరిగిందనీ, కార్పొరేట్ల కోసం కొత్త చట్టం తెచ్చారని ఆమె తప్పుపట్టారు. కార్పొరేట్నీలకు చీప్ లేబర్ సప్లై చేసేందుకే కేంద్రం ఉపాధి చట్టాన్ని రద్దు చేసిందన్నారు. కొత్త చట్టాలతో పేదల బతుకులు చిత్రమైపోతాయని, తక్కువ కూలీలు ఇచ్చే ఫ్యూడల్ వ్యవస్థ తిరిగి పురుడుపోసుకుంటుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వానికి పేదల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఉపాధి హామీ బడ్జెట్‌ను పెంచాలని, పని దినాలను 100 రోజుల నుంచి మరో 10 రోజులు పెంచాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, సులభతరమైన పనులు చేసే వెసులుబాటు ఉండటం వల్లే వారు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని సీతక్క వివరించారు. ఈ చట్టం కూలీలకు కనీస వేతనం, మహిళలకు ఆత్మగౌరవం కల్పిస్తుందని, దాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. బీజేపీ సభ్యులు బయటకు చెప్పలేకపోయినా, అంతర్గతంగా పార్టీ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పాలని సూచించారు.
గ్రామాలు పట్టణ స్వరూపాన్ని సంతరించుకుని అర్బన్ సెంటర్లుగా మారుతున్నాయని, పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ హామీ ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. “వికసిత్ భారత్ పేరుతో పేదల జీవితాలను విధ్వంసం చేస్తున్నారు. ఉపాధి చట్టాన్ని బలహీనపరచడం వల్ల వికసిత్ భారత్ సాధ్యపడదు” అని ఆమె అన్నారు. సమస్యలు ఉంటే సరిదిద్దుకోవాలనీ, ఇంట్లో ఎలుకలున్నాయనీ ఇల్లు తగలబెట్టుకుంటారా అని ప్రశ్నించారు.
జిరాంజి చట్టాన్ని ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’గా అభివర్ణించిన మంత్రి సీతక్క, జాతిపిత మహాత్మా గాంధీని ద్వేషించడం బీజేపీకి ఎందుకని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని కోరారు. ఉత్తరాధి పదాలను మాపై రుద్దితే మేం ఎలా పలుకుతామని ప్రశ్నించారు.
ఆదివాసి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతున్నదని, కూలీలు లేకపోవడంతో చీప్ లేబర్ సప్లై కోసమే ఉపాధి చట్టాన్ని రద్దు చేశారని ఆరోపించారు. రాష్ట్రాలపై 8శాతం భారం మోపారనీ విమర్శించారు. యుపీఏ హయాంలో పేదల కోసం ఆలోచించి అన్నిపార్టీలతో సంప్రదింపులు జరిపి ఉపాధిహామీ పథకాన్ని రూపొందించి పేదల బ్రతులకు భరోసా కల్పించారని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా నాలుగురోజుల్లో కొత్త చట్టం తెచ్చారని విమర్శించారు.

మహాత్ములను మరిపించే ప్రయత్నం చేస్తోంది: కాంగ్రెస్ సభ్యుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్
బీజేపీ సర్కారు మహాత్మగాంధీ, నెహ్రూ లాంటి మహాత్ములను మరిపించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు. సోనియాగాంధీ అనంతపూర్ పర్యటనలో పేదలు తమ దైన్యస్థితిని తెలుపగా స్పందించి కొప్పుల రాజు ను నోట్ చేసుకోమని చెప్పి పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని గత 2005 ఆగస్టు 23న తీసుకుచ్చారని తెలిపారు. 2006 నుంచి గత 20ఏళ్లుగా దిగ్విజయంగా అమలు చేశారనీ తెలిపారు. 90శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ, మహిళలు లబ్ధిపొందుతున్నారని వివరించారు. గత పదేళ్లుగా ఎన్డీఎ ప్రభుత్వం నీరుగారుస్తూ ఉద్దేశ్యపూర్వకంగా మార్చిందని ఆరోపించారు. ఇప్పటికే 80 శాతం రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయనీ, అలాంటి సమయంలో 40 శాతం వాటా తెలంగాణ రాష్ట్రం భరించాలే కొత్త చట్టం తేవడం సరికాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టం అమలు చేసేలా ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.

బీజేపీ సభ్యుడు ఏవీఎన్​ రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే 330కోట్లు అధనంగా కేటాయించిందన్నారు. ఉపాధ్యాయ సభ్యులు ఏ.వీ.ఎన్.రెడ్డి మాట్లాడుతూ నిధులనవి కేంద్రానివా? రాష్ట్రానివా? అనేవి అప్రస్తుతమని అన్నారు. ప్రజలు మేలు కలుగుతుందా? లేదా? అనేదే చూడాలని సూచించారు.
సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం పేరు మార్చడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఉపాధిని నిర్వీర్యం చేయడానికే కొత్త చట్టం తెచ్చారని, దీనిని ఉపసంహరించుకోవాలని కోరారు.ప్రజల జీవించే హక్కును హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు.కొత్త చట్టం జీవించే హక్కుపై గొడ్డలిపెట్టులాంటిదన్నారు.
ఈ స్వల్పకాలిక చర్చలో తీన్మార్​ మల్లన్న, బీజేపీ సభ్యుడు ఏవీఎన్​ రెడ్డి, మజ్లిస్​ సభ్యుడు రహ్మెత్​ అలీ బేగ్​, కాంగ్రెస్​ సభ్యులు మహేశ్​కుమార్​ గౌడ్​ , శంకర్​నాయక్​ , సీపై సభ్యులు నెల్లికంట సత్యంలు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text